INS Arighaat: భారత నౌకాదళం INS అరిఘాట్ జలాంతర్గామి నుంచి క్షిపణి పరీక్ష
భారత వ్యూహాత్మక అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ ద్వారా కే-4 బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించబడింది. విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఈ పరీక్షను నిర్వహించిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అరిఘాత్ నుండి కే-4 క్షిపణి ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి. సుమారు 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి పరీక్ష ఫలితాలను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను రెండు నెలల క్రితం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశానికి అంకితం చేశారు. ఐఎన్‌ఎస్ అరిహంత్ తరహాలోనే, అరిఘాత్ జలాంతర్గామి నిర్మాణం కూడా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ స్థావరం నేవల్ డాక్‌యార్డ్‌లోని షిప్ బిల్డింగ్ సెంటర్ వద్ద 2011 డిసెంబర్‌లో ప్రారంభమైంది.
3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు
తొలిదశ నిర్మాణం అనంతరం, 2017 నవంబర్ 19న జల ప్రవేశం అయ్యింది. ఆ తర్వాత రాడార్ వ్యవస్థ, ఆధునిక ఆయుధాలు, అంతర్గత పరికరాలు ఏర్పాటు చేయడం వంటి కీలక కార్యక్రమాలు పూర్తి చేశారు. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగల అణు జలాంతర్గాములు కలిగిన దేశాల్లో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా దేశాలు భారత్‌కు ముందున్నాయి. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే కె-15, కె-4 క్షిపణులను కూడా భారత్ స్వయంగా అభివృద్ధి చేసింది. ముఖ్యంగా చైనాను దృష్టిలో ఉంచుకొని, 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులను రూపొందించడం గమనార్హం.