Page Loader
Instagram: వినూత్నమైన ఫీచర్‌ను పరీక్షిస్తున్న 'మెటా'.. ఇక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్వైప్ చెయ్యక్కర్లేదు 
వినూత్నమైన ఫీచర్‌ను పరీక్షిస్తున్న 'మెటా'.. ఇక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్వైప్ చెయ్యక్కర్లేదు

Instagram: వినూత్నమైన ఫీచర్‌ను పరీక్షిస్తున్న 'మెటా'.. ఇక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్వైప్ చెయ్యక్కర్లేదు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా ప్రపంచంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడొక సాధారణ వినోదం మాత్రమే కాకుండా, చాలామందికి ఓ వ్యసనంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో, మెటా సంస్థ తాజాగా మరింత వినూత్న ఫీచర్‌ను పరీక్షిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఫీచర్ పేరు 'ఆటో స్క్రోల్'. రీల్స్ చూసే పద్ధతినే పూర్తిగా మార్చివేసే లక్ష్యంతో ఈ ఫీచర్‌ను రూపొందిస్తున్నారు. మరి ఈ ఫీచర్ ఏంటి? ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.

వివరాలు 

క్రియేటర్లకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలు

'ఆటో స్క్రోల్' అనే ఈ కొత్త ఫీచర్, రీల్స్‌ను పూర్తిగా హ్యాండ్స్ ఫ్రీగా (మన చేతులు ఉపయోగించకుండా) స్క్రోల్ అయ్యేలా రూపొందించబడుతోంది. యూజర్ ఎలాంటి స్వైప్ చేయకుండానే ఒక రీల్ పూర్తవగానే వెంటనే తదుపరి రీల్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. బయటికి ఇది చిన్న మార్పులాగా కనిపించినా, రీల్స్ వినియోగాన్ని మరింత పెంచేందుకు ఇది కీలకమైన మార్పుగా భావిస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, యూజర్లు తమ చేతులతో స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఈ కారణంగా క్రియేటర్లకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ వినియోగదారులు చూసే అవకాశం పెరగడం వల్ల, రీల్స్‌కు అల్గారిథమ్‌లలో మెరుగైన రీచ్ లభించే అవకాశం ఉంటుంది.

వివరాలు 

టెస్టింగ్ దశలో 'ఆటో స్క్రోల్' ఫీచర్‌

అయితే ఈ ఫీచర్ ఎంతవరకు ప్రయోజనకరమో అనే అంశం ఒక వైపు ఉండగా, మరోవైపు డిజిటల్ వ్యసనంపై ఆందోళనలు కూడా మొదలయ్యాయి. యూజర్లు తమ కంటెంట్ వినియోగాన్ని నియంత్రించే శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం స్వయంగా స్క్రోల్ చేయకపోతే, ఏ కంటెంట్‌ను చూడాలి, ఏదాన్ని దాటేయాలి అనే నిర్ణయం తీసుకునే ఆలోచన తక్కువయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మెటా సంస్థ ఈ 'ఆటో స్క్రోల్' ఫీచర్‌ను కొంతమంది యూజర్లతో టెస్టింగ్ దశలో కొనసాగిస్తోంది. కానీ ఇది ఇప్పట్లో అందరికీ అందుబాటులో లేదు. టెస్టింగ్ విజయవంతం అయితే, త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.