ISRO: విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన పీఎస్‌ఎల్వీ సీ 60
ఈ వార్తాకథనం ఏంటి
ఇస్రో చేపట్టిన స్పేస్ క్రాఫ్ట్స్ డాకింగ్ (అనుసంధానం), అన్ డాకింగ్ (విడదీయడం) ప్రయోగంలో మొదటి దశ విజయవంతమైంది.
పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్ ద్వారా స్పేస్‌క్రాఫ్ట్-ఏ (స్పేడెక్స్ 01), స్పేస్‌క్రాఫ్ట్-బీ (స్పేడెక్స్ 02) శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం రాత్రి 10 గంటలకు ప్రయోగం జరిగింది.
రాకెట్ మొదటి లాంచ్ పాడ్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 90 నిమిషాల్లోనే ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లు నిర్ధిష్ట కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
వివరాలు
ప్రక్రియకు 10-14 రోజులు సమయం
భూమి నుంచి 475 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న స్పేస్‌క్రాఫ్ట్-ఏ, స్పేస్‌క్రాఫ్ట్-బీ మధ్య 5 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించి, 3 మీటర్లకు తీసుకురావడానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తున్నది.
ఈ రెండు క్రాఫ్ట్‌లు డాకింగ్ ప్రక్రియలో అనుసంధానం కావడం, అనంతరం విడదీయడం జరుగుతుంది.
ఈ ప్రక్రియకు 10-14 రోజులు సమయం పడుతుందని వెల్లడించారు. స్పేస్‌క్రాఫ్ట్-ఏలో హై రిజల్యూషన్ కెమెరా ఉండగా, స్పేస్‌క్రాఫ్ట్-బీలో మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్, రేడియేషన్ మానిటర్ పేలోడ్ అమర్చారు.
ఇవి సహజ వనరులను పర్యవేక్షించి, వృక్ష సంపదపై అధ్యయనం చేస్తాయి.
వివరాలు
అంతరిక్షంలో 'భారతీయ అంతరిక్ష్ స్టేషన్'
ప్రయోగం కోసం ఇస్రో వివిధ విద్యాసంస్థలు, స్టార్టప్స్ తయారు చేసిన 10 పేలోడ్‌లు, అనుబంధ సంస్థల 14 పేలోడ్‌లు రాకెట్ నాలుగో స్టేజ్‌లో అమర్చింది.
అంతరిక్షంలో ట్రాఫిక్ కారణంగా ప్రయోగం రెండు నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైంది.
ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపిన ప్రకారం, ఇదే తరహా ఆలస్యం గతంలో చంద్రయాన్-3 మిషన్‌లోనూ చోటుచేసుకుంది.
ఈ ప్రయోగం ద్వారా ఇండియా, అస్ట్రోనాట్లను చంద్రుడిపైకి పంపడానికి అవసరమైన డాకింగ్, అన్ డాకింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అంతరిక్షంలో 'భారతీయ అంతరిక్ష్ స్టేషన్' స్థాపనకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది.
ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే, డాకింగ్, అన్ డాకింగ్ టెక్నాలజీలో నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందుతుంది.