
Instagram-WhatsApp: మెటా మీద యాంటీ ట్రస్ట్ విచారణ - ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ విక్రయంపై ఒత్తిడి తప్పదా?
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా (Meta) ప్రస్తుతం గంభీరమైన సమస్యను ఎదుర్కొంటోంది.
అమెరికాలో ఇప్పటివరకు జరుగుతున్న అతిపెద్ద యాంటీ ట్రస్ట్ (anti-trust) కేసులో ఈ కంపెనీ కీలకంగా ఎదురుదెరుక్కొనుంది.
అమెరికా సమయ ప్రకారం సోమవారం నుంచి ఈ విచారణ ప్రారంభం కానుంది.
మొత్తం 37 రోజులు కొనసాగనున్న ఈ విచారణలో మెటాపై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (US FTC) తీవ్రమైన ప్రశ్నలతో దాడి చేయనుంది.
మార్కెట్లో గుత్తాధిపత్యం సాధించేందుకు ఈ సంస్థ అనుసరిస్తున్న వ్యూహాలపై విచారణ జరగనుంది.
వివరాలు
FTC ఒత్తిడి తెచ్చే అవకాశాలు
ఈ నేపథ్యంలో మెటా సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ (Instagram), వాట్సాప్ (WhatsApp) యాప్‌లను విక్రయించాలని FTC ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రెండు ప్రధాన సామాజిక మాధ్యమాల కొనుగోలు ద్వారా మెటా పోటీదారులను తొలగించే వ్యూహం అమలు చేసిందని కమిషన్ ఆరోపిస్తోంది.
ఫేస్‌బుక్ సామాజిక మాధ్యమ రంగంలో ఆధిపత్యాన్ని పెంచుకునే లక్ష్యంతోనే ఈ కొనుగోళ్లు జరిగాయని FTC తెలిపింది.
ఈ విషయంలో మెటా సంస్థలోని కొన్ని అంతర్గత ఈమెయిల్స్ కూడా కమిషన్ పరిశీలనలోకి తెచ్చింది.
ముఖ్యంగా మెటా సీఈఓ మార్క్ జకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఒక ఈమెయిల్‌లో పేర్కొన్న "పోటీ పడే బదులు, వాటిని కొనడం చాలా మంచిది" అనే వాక్యం ద్వారా వారి వ్యూహం స్పష్టమవుతోందని FTC అభిప్రాయపడింది.
వివరాలు
విచారణకు న్యాయమూర్తి జేమ్స్ బోస్‌బర్గ్..
ఈ విచారణకు న్యాయమూర్తి జేమ్స్ బోస్‌బర్గ్ (James Boasberg) నేతృత్వం వహించనున్నారు.
మొదటగా 'పర్సనల్ సోషల్ నెట్‌వర్కింగ్' విభాగంలో మెటా ఏకాధికార స్థానంలో ఉందా లేదా అన్న అంశంపై కమిషన్ స్పష్టతకు రావాల్సి ఉంటుంది.
ఇక మరోవైపు, ఈ విచారణకు సంబంధించి మెటా కోర్టును ఆశ్రయించింది.
తమ సంస్థ ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెట్టిందని, ఆ పెట్టుబడులు లేకపోయుంటే ఈ యాప్‌లు ఇప్పటికీ ప్రజాదరణ పొందేవి కాదని మెటా న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు.
వివరాలు
కంపెనీ ఆదాయంలో సగం ఇన్‌స్టాగ్రామ్ నుంచే..
అయితే, కోర్టు తీర్పు మెటాకు వ్యతిరేకంగా వచ్చినట్లయితే, FTC తీసుకునే నిర్ణయాలు ఈ సంస్థ భవిష్యత్తుపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.
ముఖ్యంగా, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ విక్రయాలు జరిగితే టెక్నాలజీ రంగం కుదేలయ్యే పరిస్థితి ఏర్పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది ఆర్థికంగా కూడా మెటాకు గట్టి దెబ్బే అవుతుంది. కంపెనీ ఆదాయంలో సగం ఇన్‌స్టాగ్రామ్ నుంచే వస్తున్నట్లు సమాచారం.
దాంతో ఈ విచారణ ఫలితాలు మెటా భవిష్యత్‌తో పాటు, మొత్తం టెక్ ఇండస్ట్రీనే ప్రభావితం చేయబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.