Page Loader
Mark Zuckerberg: ముగిసిన మెటా అధినేత జుకర్‌బర్గ్‌ యాంటీ ట్రస్ట్ ట్రయల్‌ విచారణ 
ముగిసిన మెటా అధినేత జుకర్‌బర్గ్‌ యాంటీ ట్రస్ట్ ట్రయల్‌ విచారణ

Mark Zuckerberg: ముగిసిన మెటా అధినేత జుకర్‌బర్గ్‌ యాంటీ ట్రస్ట్ ట్రయల్‌ విచారణ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

మెటా సంస్థ (Meta) ప్రస్తుతం తన చరిత్రలోనే అతిపెద్ద యాంటీ-ట్రస్ట్‌ విచారణను ఎదుర్కొంటోంది. సామాజిక మాధ్యమాల్లో ఆధిపత్యం కోసం ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లను కొనుగోలు చేసిందన్న ఆరోపణలపై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (US FTC) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ ఆరోపణలను మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఖండించారు. తాను ఈ కంపెనీల్లో ఉన్న విలువను గుర్తించి వాటిని కొనుగోలు చేశానని స్పష్టంచేశారు. ఈ విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఆయనపై విచారణ ముగిసింది.

వివరాలు 

సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి

విచారణ సందర్భంగా అధికారుల నుండి వచ్చిన పలు ప్రశ్నలకు జుకర్‌బర్గ్ సమాధానాలు ఇచ్చారు. టిక్‌టాక్, యూట్యూబ్ వంటి చైనా, ఇతర దేశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో తమకు ఎలా పోటీ ఎదురవుతుందనే ప్రశ్నకు స్పందిస్తూ, యూజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కంటే ఎక్కువగా టిక్‌టాక్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. యూట్యూబ్ ప్రధానంగా వీడియోల కోసం రూపొందించబడిందని వివరించారు. తన బృందం సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టిందని, కొత్త అభివృద్ధుల కోసం కృషి చేశామని చెప్పారు. తాను కంపెనీల విలువను గుర్తించి వాటిని తీసుకున్నానే తప్ప పోటీని తుంచేయాలనే ఉద్దేశంతో ఇది జరగలేదని స్పష్టం చేశారు. ఇంకా ఇప్పటికీ మెటా అనేక ఇతర సామాజిక మాధ్యమాలతో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.

వివరాలు 

మెటాలోని అంతర్గత ఈమెయిల్స్‌పై  కమిషన్ ప్రస్తావన 

అయితే, US FTC మాత్రం వేరే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. పోటీనిరోధానికి వ్యూహాత్మకంగా, దీర్ఘకాలిక ప్రణాళికగా మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లను కొనుగోలు చేసిందని కమిషన్ ఆరోపిస్తోంది. ఒకే వేదికపై సామాజిక మాధ్యమ రంగంలో ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో ఇది జరిగిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మెటాలోని కొన్ని అంతర్గత ఈమెయిల్స్‌ను కమిషన్ ప్రస్తావించింది. వాటిలో జుకర్‌బర్గ్ రాసిన ఒక మెయిల్‌లో "పోటీ చేయడంలో కంటే వాటిని కొనడం ఉత్తమం" అని పేర్కొన్నారట. ఇది మెటా వ్యూహం ఎలా ఉందో స్పష్టంగా తెలియజేస్తుందనీ FTC వ్యాఖ్యానించింది.

వివరాలు 

మెటా సంస్థ ఆదాయంలో సుమారు 50% ఇన్‌స్టాగ్రామ్‌ నుంచే..

ఈ విచారణ విషయమై మెటా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ పెట్టుబడుల వల్లే ఆ యాప్స్ అంతగా ప్రాచుర్యం పొందినట్లేనని, లేకపోతే వాటికి అంత ఆదరణ ఉండేది కాదని మెటా తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే, కోర్టు తీర్పు మెటాకు వ్యతిరేకంగా వస్తే.. FTC తీసుకునే చర్యలు కీలకంగా మారవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మెటా సంస్థకు ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌ను విక్రయించాల్సిన అవసరం తలెత్తవచ్చని అంచనా. ప్రస్తుతం మెటా సంస్థ ఆదాయంలో సుమారు 50% ఇన్‌స్టాగ్రామ్‌ నుంచే వస్తుందని సమాచారం. అయితే వాటిని మెటా నుంచి వేరు చేయడం అంత సులభమైన ప్రక్రియ కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.