Loading...
Mongolia Dinosaur Footprints: మంగోలియాలో 12 కోట్ల ఏళ్లనాటి డైనోసార్‌ జాడలు... 70 ఏళ్ల తరువాత మళ్లీ వెలుగులోకి
మంగోలియాలో 12 కోట్ల ఏళ్లనాటి డైనోసార్‌ జాడలు... 70 ఏళ్ల తరువాత మళ్లీ వెలుగులోకి

Mongolia Dinosaur Footprints: మంగోలియాలో 12 కోట్ల ఏళ్లనాటి డైనోసార్‌ జాడలు... 70 ఏళ్ల తరువాత మళ్లీ వెలుగులోకి

వ్రాసిన వారు Balachander Sharma
Nov 24, 2026
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మంగోలియాలో దాదాపు 12 కోట్ల ఏళ్ల క్రితం డైనోసార్లు సంచరించిన ప్రాంతం 70 ఏళ్ల తర్వాత మళ్లీ శాస్త్రవేత్తలకు కనిపించింది. ఉత్తర మంగోలియాలోని సైజురాఖ్‌ ప్రాంతంలో గుర్తించిన ఈ పురాతన ప్రదేశంలో మొత్తం 31 శిలాజ అడుగుల జాడలు బయటపడ్డాయి. వీటిలో భారీ శరీరంతో ఉండే మొక్కలు తినే సారోపాడ్‌ డైనోసార్లతో పాటు, మాంసాహార థెరోపాడ్‌ల అడుగుల గుర్తులు కూడా ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో భారీ శాకాహారులు, ప్రమాదకరమైన వేటగాళ్లు రెండూ సంచరించేవన్నమాట.

Details

57 సెంటీమీటర్ల భారీ అడుగు ముద్ర

ఈ పరిశోధనలో కనిపించిన కొన్ని అడుగుల జాడలు డైనోసార్ల పరిమాణాన్ని అంచనా వేసేందుకు కీలక ఆధారాలుగా మారాయి.

ముఖ్యంగా మాంసాహార డైనోసార్‌కు చెందిన అతిపెద్ద పాదముద్ర పొడవు ఏకంగా 57 సెంటీమీటర్లు ఉంది.

ఆ జాడల ఆధారంగా వాటిని వేసిన డైనోసార్లు సుమారు 7.4 నుంచి 8.8 మీటర్ల పొడవు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

మొత్తం ఐదు భారీ థెరోపాడ్‌లు ఈ ప్రాంతం మీదుగా వెళ్లి ఉండొచ్చని ఆధారాలు కనిపించాయి.

Details

ఒకే దారిలో నడిచిన భారీ డైనోసార్లు

ఈ ప్రాంతంలో రెండు భారీ సారోపాడ్‌ డైనోసార్లకు చెందిన 15 మీటర్లకు పైగా పొడవైన అడుగుల మార్గాలను కూడా పరిశోధకులు గుర్తించారు.

కొన్ని చోట్ల ఈ అడుగుల జాడలు ఒకదానిపై మరొకటి కనిపించాయి. దీంతో ఒక డైనోసార్‌ వెళ్లిన దారినే మరోటి కూడా అనుసరించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కష్టమైన ప్రాంతాల్లో ఏనుగులు ఒకే దారిని అనుసరించే విధానంతో ఇది పోలి ఉండొచ్చని చెబుతున్నారు.

ADVERTISEMENT

Details

పురాతన సరస్సు ఒడ్డునే ఈ జాడలు

సుమారు 12 కోట్ల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పెద్ద సరస్సు ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు. నీటి మట్టం తగ్గినప్పుడు ఒడ్డున తడి మట్టి, ఇసుక బయటపడేవి.

ఆ సమయంలో డైనోసార్లు వాటిపై నడవడంతో పాదముద్రలు ఏర్పడ్డాయి. తర్వాత అవి మట్టి, ఇసుక పొరల కింద కప్పబడి క్రమంగా రాతిగా మారాయి.

అందుకే ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా ఆ అడుగుల గుర్తులు శాస్త్రవేత్తలకు దొరికాయి.

ADVERTISEMENT

Details

మంగోలియాలో డైనోసార్లపై కొత్త ఆధారం

ఉత్తర మంగోలియాలో ఇంత పెద్ద మాంసాహార డైనోసార్లు జీవించాయనే ఆధారాలు గతంలో చాలా తక్కువగా ఉండేవి.

చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఉత్తర అమెరికాలో ఇలాంటి డైనోసార్ల ఆనవాళ్లు ఉన్నప్పటికీ మంగోలియాలో వాటి ఉనికి స్పష్టంగా తెలియలేదు.

ఇప్పుడు లభించిన 31 పాదముద్రలు ఆ లోటును భర్తీ చేస్తున్నాయి. భవిష్యత్‌లో సమీపంలోని ఇసుక, రాళ్ల పొరల్లో డైనోసార్‌ ఎముకలు, పళ్ల కోసం పరిశోధనలు చేయనున్నారు.

ఈ అధ్యయనం Ichnos జర్నల్‌లో మార్చి 19, 2026న ప్రచురితమైంది.

ADVERTISEMENT