Sunita Williams: సునీతా విలియమ్స్ ఆరోగ్యం దెబ్బతింటోందా?.. ఆందోళన చెందుతున్న వైద్యులు
స్టార్‌లైనర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్‌మోర్ భూమికి తిరిగి రావడానికి వచ్చే ఏడాది వరకు ఆగాల్సి వచ్చింది. జూన్ 5న వీరు ప్రయాణించిన స్టార్‌లైనర్‌లో ప్రొపల్షన్ వ్యవస్థలో తీవ్రమైన సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా ప్రకటించింది. దీని కారణంగా సునీతా విలియమ్స్ అనారోగ్యానికి గురవుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలలో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లు కనిపిస్తోంది. ఆమె బుగ్గలు లోపలకి వెళ్లినట్లు, శరీరంలో పోషకాహార లోపం ఉందని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా తెలిపారు.
వ్యోమగాములకు 'స్పేస్ ఎనీమియా' రోగం వచ్చే అవకాశం
అంతరిక్షంలో వ్యోమగాములకు 'స్పేస్ ఎనీమియా' రోగం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో ఎర్ర రక్తకణాలు వేగంగా క్షీణిస్తాయి. శరీరంలో ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకునేందుకు శరీరం ఎర్ర రక్తకణాలను నాశనం చేస్తూ సమతుల్యతను కాపాడుతుంది. దీని వలన అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు బయటపడుతాయి. గుండె పనితీరుపై కూడా దీని ప్రభావం పడవచ్చు. సునీత,విల్‌మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు. వాస్తవానికి వీరు జూన్ 14న తిరిగి రావాల్సి ఉండగా, హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అందువల్ల వారు 2024 ఫిబ్రవరి వరకు అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నారు.