
Sunita Williams: సునీత విలియమ్స్‌ను తీసుకొచ్చేందుకు వేగంగా ఏర్పాట్లు.. క్రూ-10 ప్రయోగానికి నాసా ఏర్పాట్లు..
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‌ను తిరిగి తీసుకురావడానికి ఉత్కంఠ కొనసాగుతోంది.
గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, నాసాకు ఇప్పటివరకు విజయం లభించలేదు.
9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పుడు ఆమె తిరిగి భూమికి రానున్న మార్గం సుగమమవుతోంది.
సునీతా విలియమ్స్‌ను భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. క్రూ-10 ప్రయోగానికి నాసా సిద్ధమవుతోంది.
సాంకేతిక సమస్యల కారణంగా నిన్నటి ప్రయోగం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
శుక్రవారం తెల్లవారుజామున స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్ ప్రయోగానికి సిద్ధమవుతుండగా, ఫాల్కన్-9 రాకెట్ యొక్క గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో మిషన్‌ను రద్దు చేశారు.
వివరాలు
శనివారం ఉదయం 4:30 గంటలకు ప్రయోగం
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) మరియు స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా తమ క్రూ-10 మిషన్‌ను శుక్రవారం సాయంత్రం 7:03 గంటలకు (EDT) ప్రయోగించనున్నట్లు ప్రకటించాయి.
భారత కాలమానం ప్రకారం, ఈ ప్రయోగం శనివారం ఉదయం 4:30 గంటలకు ప్రారంభం కానుంది.
మార్చి 19 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశం ఉందని నాసా తెలిపింది.
అన్నీ అనుకూలిస్తే, ఈ నెల 20 తర్వాత సునీతా మరియు బుచ్ భూమికి చేరుకునే అవకాశం ఉంది.
సాంకేతిక కారణాల వల్ల కెన్నెడీ స్పేస్ సెంటర్ (ఫ్లోరిడా) నుంచి క్రూ-10 మిషన్ ప్రయోగాన్ని స్పేస్‌ఎక్స్ వాయిదా వేసిన 24 గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
వివరాలు
మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కొత్త బృందం
ఈ మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ఒక కొత్త బృందం వెళ్లనుంది.
ఈ బృందంలో నాసా నుంచి అన్నే మెక్‌లేన్, నికోల్ అయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) నుంచి టకుయా ఒనిషి, రష్యా రోస్కోస్మోస్ ఏజెన్సీ నుంచి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు.
సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో తిరిగి భూమికి రాలేకపోయారు.
అంతరిక్షం నుంచి వీరి రాక కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.