NASA: అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ: క్రూ-11 స్పేస్‌వాక్ వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) మెడికల్ అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఓ వ్యోమగామికి ఆరోగ్య సమస్య రావడంతో, నాసా (NASA)ఆ వ్యోమగామికి షెడ్యూల్ చేసిన స్పేస్‌వాక్‌ను తక్షణమే వాయిదా వేసింది. ఈ వ్యోమగామిని వీలైనంత త్వరగా భూమి పైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే, అసలు ఏమైంది అంటే... ఈ ఏడాది తొలి స్పేస్‌వాక్‌ను నాసా ఇటీవల ప్రకటించింది.అమెరికా కాలమానం ప్రకారం, జనవరి 8న వ్యోమగాములు మైక్ ఫిన్సీ, జెనా కార్డ్‌మన్ 6.5 గంటలపాటు స్పేస్‌వాక్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే, చివరి నిమిషంలోనే ఈ కార్యక్రమాన్ని నాసా నిలిపివేసింది. క్రూ-11 మిషన్‌లో వెళ్లిన ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తిన కారణంగా స్పేస్‌వాక్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు నాసా వెల్లడించింది.
వివరాలు
క్రూ-11 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు
అయితే, గోప్యతా కారణాలు, ప్రోటోకాల్ దృష్ట్యా ఆ వ్యోమ గామి పేరు, వైద్య కారణాలను నాసా బయటపెట్టలేదు. వాస్తవానికి,క్రూ-11 మిషన్‌లో మొత్తం నలుగురు వ్యోమగాములు ISSకు వెళ్లారు. వీరిలో మైక్ ఫిన్సీ, జెనా కార్డ్‌మన్ ఉన్నారు. వైద్య సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ, ఆ వ్యోమగామి ఆరోగ్యం స్థిరంగా ఉందని నాసా తెలిపారు. తాజా పరిణామాల ప్రకారం,నెల ముందుగానే ఈ క్రూ-11 మిషన్ వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇలా షెడ్యూల్ సమయానికంటే ముందుగానే ఈ మిషన్‌ను ముగించడం ఐఎస్‌ఎస్ 25 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వివరాలు
రెండవ షెడ్యూల్ పై కూడా ప్రభావం
నాసా ఈ నెలలో రెండు స్పేస్‌వాక్‌లు నిర్వహించాలనే ప్రణాళికలు రూపొందించిందని కూడా తెలియజేసింది. జనవరి 8వ తేదీతో పాటు 15న మరొక స్పేస్‌వాక్ జరగనుంది. తొలి స్పేస్‌వాక్ వాయిదా పడటంతో, రెండవ షెడ్యూల్ పై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అంతరిక్ష కేంద్రంలో వైద్య సమస్యలు తలెత్తడం అత్యంత అరుదు. గతంలో మైక్రోగ్రావిటీ కారణంగా వ్యోమగాముల రక్త సరఫరా, రక్త గడ్డ కట్టడం వంటి సమస్యలు ఎదురైన సందర్భాలు ఉన్నా, వాటిని నాసా బయటకు వెల్లడించలేదు.