PSLV-C59: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ విజయవంతంగా నింగిలోకి ప్రయాణించింది. ఈ రాకెట్ ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ప్రోబా-3 మిషన్‌లో భాగంగా ప్రోబా-3 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుని కరోనాను పరిశీలించడమే ఈ మిషన్ ముఖ్యోద్దేశ్యం. అసలు ఈ ప్రయోగం నిన్ననే జరగాల్సి ఉండగా, ప్రోబా-3 స్పేస్‌క్రాఫ్ట్‌లో చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఇస్రో దీనిని వాయిదా వేసింది.
ఉపగ్రహాలు సుమారుగా 550 కిలోల బరువు
ఈ ప్రయోగాన్ని ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) సహకారంతో నిర్వహించింది. ప్రోబా-3 మిషన్‌లో రెండు ఉపగ్రహాలు ఉన్నాయని, వీటిలో ఒకటి కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ కాగా, మరొకటి ఆక్యుల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ అని పేర్కొన్నారు. సుమారు 550 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ భూకక్ష్యలో క్రమంగా చక్కటి క్రమంలో విహరించనున్నాయి.
ఉపగ్రహం పనిచేయకపోతే, మొత్తం మిషన్ ప్రభావితం అవుతుంది
ఈ మిషన్ కృత్రిమ సూర్యగ్రహణం పరిస్థితులను సృష్టించి, సూర్యుడి బయటి పొర అయిన కరోనాను నిశితంగా పరిశీలిస్తుంది. ఈ జంట ఉపగ్రహాల్లో ఒకటి సూర్యుడిని కప్పి కృత్రిమ గ్రహణం సృష్టిస్తే, మరొకటి కరోనాను విశ్లేషణ చేస్తుంది. ఈ మిషన్ స్పెయిన్, పోలాండ్, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల సహకారంతో రూపొందించబడింది. రెండు ఉపగ్రహాలను ఒకే ప్రయోగంలో నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడం అత్యంత కీలకం. ఉపగ్రహాలు సమన్వయంతో పనిచేస్తూ, కరోనాపై విలువైన పరిశోధనలు చేయనున్నాయి. అయితే, ఒక ఉపగ్రహం పనిచేయకపోతే, మొత్తం మిషన్ ప్రభావితం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.