Proba-3 mission: ప్రోబా-3 పేరుతో ఐరోపా అంతరిక్ష సంస్థ వినూత్న ప్రయోగానికి శ్రీకారం.. ఇది ఎందుకు కీలకం?
సూర్యుని భగభగల వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుని వెలుపలి పొర అయిన కరోనా గురించి ఇంకా ఎంతో సమాచారం తెలుసుకోవాల్సి ఉంది. కానీ సూర్యుడి మహత్తైన కాంతుల మధ్య ఈ మసకమైన పొరను పరిశీలించడం చాలా కష్టమైన పని. ఈ సవాళ్లను అధిగమించి, కరోనాపై లోతైన అధ్యయనాలు చేయడానికి ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రోబా-3 పేరుతో జంట ఉపగ్రహాలను గురువారం(DEC 5) నింగిలోకి పంపుతోంది. ఈ ప్రయోగం ప్రత్యేకత కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా కరోనాను అధ్యయనం చేయడంలో ఉంది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కి చెందిన పీఎస్‌ఎల్‌వీ-సి59 రాకెట్‌తో జరగనుంది.
ప్రోబా-3
కరోనా పరిశీలనలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రోబా-3ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ మిషన్‌లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి: ఆకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ (OSC) కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC) ఈ ఉపగ్రహాలు సమన్వయంతో పని చేస్తాయి, కరోనా పరిశీలనను మరింత సమర్థవంతంగా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. జీవితకాలం రెండు సంవత్సరాలు ఉండే ప్రోబా-3 మిషన్ కోసం మొత్తం వ్యయం రూ. 1,800 కోట్లుగా అంచనా వేయబడింది. ఈ ప్రాజెక్టులో ఆకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ బరువు 200 కిలోలుగా, కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ బరువు 340 కిలోలుగా ఉంది. ఈ ప్రాజెక్టుకు 13 ఐరోపా దేశాలు మరియు కెనడా భాగస్వామ్యులుగా ఉన్నాయి.
ఎందుకీ ప్రయోగం?
సౌర కరోనాలో ఉష్ణోగ్రతలు 20లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతాయి.సూర్యుడిలో జరుగుతున్న మార్పులు, సౌర తుపాన్లు,సౌర జ్వాలల విడుదల వంటి ఘటనల్లో కరోనా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పరిణామాలు అంతరిక్షవాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.వీటి వల్ల భూమిపై ఉన్న విద్యుత్ గ్రిడ్‌లు,ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలు,నావిగేషన్ సేవలు తీవ్రంగా ప్రభావితమవవచ్చు. సంప్రదాయ పద్ధతుల ద్వారా సౌరకరోనాను పరిశీలించడం చాలా కష్టం.దీని కారణం,సూర్యుడి మహత్తర తేజస్సు ముందు కరోనా వెలుగు కనిపించకపోవడం. సూర్యుడి ప్రకాశం,కరోనాలోని ప్రకాశవంతమైన ప్రాంతంతో పోలిస్తే 10లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణాల సమయంలో మాత్రమే,చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పినప్పుడు కరోనా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఇటువంటి గ్రహణాలు చాలా అరుదు,పైగా అవి కేవలం కొద్ది నిమిషాల పాటు మాత్రమే కొనసాగుతాయి.
పరిశీలన ఇలా
భూమి మీద నుంచి ప్రయోగించేటప్పుడు ప్రోబా-3లోని రెండు ఉపగ్రహాలు కలిసి ఉంటాయి. ఈ ఉపగ్రహాలను భూమి చుట్టూ ఉన్న 600 × 60,530 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టుతారు. అక్కడి నుంచి ఉపగ్రహాలు విడిపోతాయి. ఇవి తమ కక్ష్యలో ఒక పరిభ్రమణాన్ని పూర్తిచేయడానికి 19 గంటలు 36 నిమిషాలు తీసుకుంటాయి. కక్ష్యలో భూమికి దూరంగా ఉన్న 60,530 కిలోమీటర్ల స్థితికి చేరుకున్నప్పుడు, అవి ఒక నిర్దిష్ట పద్ధతిలో (ఫార్మేషన్ ఫ్లయింగ్) విహరించేందుకు ఆదేశాలు అందుకుంటాయి. ఈ సమయంలో, వాటి మధ్య దూరం 150 మీటర్లు ఉంటుంది. సెకనుకు 1 కిలోమీటరు వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. ఈ సర్దుబాటును ఉపగ్రహాలు స్వయంగా నిర్వహిస్తాయి, అందుకోసం వాటిలో ఆధునిక నేవిగేషన్, నియంత్రణ వ్యవస్థలు అమర్చబడ్డాయి.
6 గంటల పాటు కొనసాగే ప్రక్రియ
ఈ దశలో, ఓఎస్‌సీ ఉపగ్రహం సూర్యుడి వైపుగా నిలుస్తుంది. ఇందులో 1.4మీటర్ల వెడల్పైన ఆకల్టింగ్ డిస్క్ ఉంటుంది, ఇది 150 మీటర్ల దూరంలో సుమారు 8 సెంటీమీటర్ల వెడల్పుతో నీడను ఏర్పరుస్తుంది. ఈ నీడలోనే సీఎస్‌సీ ఉపగ్రహం విహరిస్తుంది. టెలిస్కోపులోని అపెర్చర్ 8సెంటీమీటర్ల వెడల్పున్న నీడలోనే ఇమిడిపోతుంది, దాంతో సూర్యుడి దృక్కోణంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఫలితంగా టెలిస్కోప్ సౌర కరోనాను స్పష్టంగా వీక్షించి ఫోటోలు తీయగలుగుతుంది. ఈ ప్రక్రియ 6 గంటల పాటు కొనసాగుతుంది.ఈ సమయంలో మిల్లీమీటర్ స్థాయిలో కూడా తేడా రాకుండా రెండు ఉపగ్రహాలు సమన్వయంతో విహరించాలి. ఆరు గంటల తర్వాత,ఉపగ్రహాలు 'ఫార్మేషన్ ఫ్లయింగ్' నుంచి బయటకు వచ్చి, భూమికి చేరువగా ఉండే కక్ష్య బిందువుల దిశగా ప్రయాణం కొనసాగిస్తాయి.
సహజసిద్ధ సూర్యగ్రహణాలతో పోలిస్తే ప్రత్యేకతగా...
శతాబ్ద కాలంలో సుమారు 60 సంపూర్ణ సూర్యగ్రహణాలు మాత్రమే జరుగుతుంటాయి. అయితే, ప్రోబా-3 ప్రతి 19 గంటల 36 నిమిషాలకు ఒకసారి 6 గంటల పాటు కరోనాను పరిశీలించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నిరంతరాయ వీక్షణ కాలంలో ఇది సహజసిద్ధ సూర్యగ్రహణం కంటే 100 రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని అందించడం విశేషం. ఇది కరోనాపై మరింత లోతైన, నాణ్యమైన పరిశోధనలకు సహకారం అందిస్తుంది. ప్రోబా-3, దిగువ, మధ్య కరోనాకు మధ్య ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా వీక్షిస్తుంది. భవిష్యత్‌లో, ఈ సాంకేతికత పాత ఉపగ్రహాలకు ఇంధనాన్ని పునఃనింపడం లేదా ఇతర గ్రహాల నుంచి నమూనాలను సేకరించడంలో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.