Loading...
New Jersey: న్యూజెర్సీ ఇంటిపై పడిన ఉల్కలో గ్రహాంతర మూలాలున్న జీవరసాయనాల ఆనవాళ్లు
న్యూజెర్సీ ఇంటిపై పడిన ఉల్కలో గ్రహాంతర మూలాలున్న జీవరసాయనాల ఆనవాళ్లు

New Jersey: న్యూజెర్సీ ఇంటిపై పడిన ఉల్కలో గ్రహాంతర మూలాలున్న జీవరసాయనాల ఆనవాళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో రెండేళ్ల క్రితం ఓ ఇంటి పైకప్పును ఛేదించి పడిన ఉల్కశకలం ఇప్పుడు శాస్త్రవేత్తలకు సౌర కుటుంబం ఆవిర్భావ రహస్యాలను తెలుసుకునే అరుదైన అవకాశాన్ని అందించింది. ఈ ఉల్కలో భూమిపై సహజంగా కనిపించని గ్రహాంతర మూలాలున్నఅమైనో ఆమ్లాలను గుర్తించినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. జీవం ఏర్పడటానికి అవసరమైన రసాయన పదార్థాలు అంతరిక్షం నుంచే భూమికి చేరి ఉండొచ్చనే సిద్ధాంతానికి ఈ పరిశోధన మరింత బలం చేకూర్చింది. 2024 జూలై 16న న్యూయార్క్,న్యూజెర్సీ,కనెక్టికట్,రోడ్ ఐలాండ్,పెన్సిల్వేనియా రాష్ట్రాల్లోని ప్రజలు పగటిపూట ఆకాశంలో దూసుకెళ్లిన భారీ అగ్నిగోళాన్ని చూశారు. స్ట్యాచ్యూ ఆఫ్ లిబర్టీ దక్షిణ భాగం మీదుగా గంటకు సుమారు 51వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన ఈ అంతరిక్షశిల భారీ శబ్ద తరంగాలను సృష్టించింది.

వివరాలు 

భూమికి సుమారు 35 కిలోమీటర్ల ఎత్తులోనే ముక్కలుగా విరిగిపోయిన ఉల్క

అనంతరం అది భూమికి సుమారు 35 కిలోమీటర్ల ఎత్తులోనే అనేక ముక్కలుగా విరిగిపోయింది.

డాప్లర్ వాతావరణ రాడార్ ఈ శకలాలు నేలపై పడినట్లు గుర్తించినప్పటికీ, ఒక్క శకలం మాత్రమే న్యూజెర్సీలోని హిల్స్‌బరో ప్రాంతంలోని ఓ ఇంటిలో లభించింది.

రెండు పౌండ్లకు పైగా బరువున్న ఈ శకలం ఇంటి మాస్టర్ బెడ్‌రూమ్ పైకప్పును చీల్చుకుని మంచంపై పడింది.

ఘటనలో ఎవరూ గాయపడలేదు.ఇంటి యజమానులు అప్రమత్తంగా వ్యవహరించి,వెంటనే డిస్పోజబుల్ గ్లౌజులు ధరించి,అల్యూమినియం ఫాయిల్,గాజు సీసాల్లో ఉల్క శకలాలు,ధూళిని జాగ్రత్తగా భద్రపరిచారు.

అదే రోజు వర్షం కురిసే ముందు పైకప్పును కూడా మరమ్మతు చేశారు.

దీంతో గాలిలోని తేమ ఉల్కలోకి చేరకుండా ఉండటంతో శకలం కలుషితం కాకుండా సంరక్షించబడింది.

వివరాలు 

ఈ ఉల్కలోని అమైనో ఆమ్లాల్లో భూమిపై జీవుల్లో కనిపించవు 

ఈ జాగ్రత్తల వల్లే శాస్త్రవేత్తలు అసలు స్వరూపంలో ఉన్న నమూనాను అధ్యయనం చేసే అవకాశం పొందారు.

ఈ పరిశోధన ఫలితాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

సెటి ఇన్‌స్టిట్యూట్‌,నాసా పరిశోధకుడు పీటర్ జెన్నిస్కెన్స్ నేతృత్వంలోని బృందం ఈ ఉల్కను విశ్లేషించింది.

పరిశోధనలో నీటితో చేసిన పరీక్షల్లో జీవకణాల్లోని ప్రోటీన్ల నిర్మాణానికి అవసరమైన అమైనో ఆమ్లాల సముదాయం బయటపడింది.

నాసా గాడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ డానీ గ్లావిన్ ప్రకారం,ఈ ఉల్కలో గుర్తించిన అమైనో ఆమ్లాల్లో చాలా వరకు భూమిపై జీవుల్లో కనిపించవు.

అవి నిజంగానే గ్రహాంతర మూలాల నుంచి వచ్చినవని ఆయన తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

ఈ ఉల్క సీఎం½ (CM½) కార్బనేసియస్ కాండ్రైట్ రకం

అంతేకాదు, ఈ ఉల్కలో గుర్తించిన అమైనో ఆమ్లాల వైవిధ్యం బెన్ను, ర్యుగు గ్రహశకలాల నుంచి సేకరించిన నమూనాల కంటే ఎక్కువగా ఉందని వెల్లడించారు.

శాస్త్రవేత్తలు ఈ ఉల్కను అరుదైన సీఎం½ (CM½) కార్బనేసియస్ కాండ్రైట్ రకంగా గుర్తించారు.

ఇది సౌర కుటుంబం ఏర్పడిన తొలి దశలో ఏర్పడిన అంతరిక్ష శిలల అవశేషంగా భావిస్తున్నారు.

ఈ తరహా ఉల్కలు నీరు కలిగిన ఖనిజాలు, కార్బన్ ఆధారిత సేంద్రీయ సమ్మేళనాలను తమలో భద్రపరచుకుంటాయి.

భూమిపై ప్రత్యక్షంగా పడిన సీఎం½ రకం ఉల్కను పరిశోధకులు స్వచ్ఛమైన స్థితిలో అధ్యయనం చేయడం ఇదే తొలిసారి.

ADVERTISEMENT

వివరాలు 

ఈ ఉల్కలో సోడియం అధికం

ఈ ఉల్కలో సోడియం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇది ఒకప్పుడు ఆ గ్రహశకలంలో ఉప్పు కలిసిన మంచు నీరు లేదా ఉప్పునీటి ద్రావణం ఉన్నట్లు సూచిస్తోందని వారు భావిస్తున్నారు.

నీరు ఆవిరైపోయిన తర్వాత మిగిలిన ఉప్పు ఖనిజాలు జీవం ఏర్పడటానికి అవసరమైన సేంద్రీయ అణువుల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు కల్పించి ఉండొచ్చని అధ్యయనం చెబుతోంది.

ఈ ఉల్క ఒకప్పుడు అంగారకుడు (మార్స్), గురుడు (జూపిటర్) గ్రహాల మధ్య ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్‌లో తిరిగిన భారీ గ్రహశకలం భాగంగా ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

లక్షల ఏళ్ల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన ఈ శకలం చివరకు భూమిని చేరిందని వారు పేర్కొన్నారు.

వివరాలు 

పరిశోధనలో మరో ఆసక్తికర విషయం

పురాతన కార్బన్‌ సమృద్ధిగా ఉన్న ఉల్కలే భూమిపై తొలి సేంద్రీయ పదార్థాలను తీసుకువచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు.

హిల్స్‌బరో ఉల్క అధ్యయనం ఆ సిద్ధాంతానికి మరింత బలమైన ఆధారాలను అందిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

ముఖ్యంగా నీరు, ఖనిజాలు,సేంద్రీయ పదార్థాల పరస్పర చర్యలపై ఈ నమూనా కీలక సమాచారాన్ని అందించనుందని అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిశోధనలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇంటి యజమానులు సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయి ఉంటే ఈ అరుదైన శాస్త్రీయ సమాచారం పూర్తిగా నష్టపోయేదని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

పరిశోధనలో మరో ఆసక్తికర విషయం

ప్రస్తుతం ఈ ఉల్క శకలాలను న్యూయార్క్‌లోని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో భద్రపరిచి, మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి అగ్నిగోళాల వీడియోలను ప్రజలు డోర్‌బెల్ కెమెరాలు, డాష్‌క్యామ్‌ల ద్వారా అందిస్తే మరిన్ని ఉల్కలను గుర్తించి, సౌర కుటుంబ పరిణామంపై లోతైన అవగాహన పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ADVERTISEMENT