LOADING...
ChatGPT: టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించిన ఓపెన్ఏఐ..
టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించిన ఓపెన్ఏఐ..

ChatGPT: టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించిన ఓపెన్ఏఐ..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తర్వాత, ఏ సమాచారం కోసం అయినా ఏఐ సేవలను ఆశ్రయించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆధారపడడం అనుకోని సమస్యలకు దారి తీస్తోంది. ఇటీవలి కాలంలో ఓ టీనేజర్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఓపెన్‌ఏఐ అధికారికంగా స్పందిస్తూ,తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. కాలిఫోర్నియాలోని రాంచో శాంటా మార్గెరిటాకు చెందిన 16 ఏళ్ల ఆడమ్ రైన్ ఈ సంవత్సరం ఏప్రిల్ 11న ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు గంటల పాటు చాట్‌జీపీటీతో మాట్లాడేవాడని, చాట్‌బాట్ ఇచ్చిన స్పందనలే ఆడమ్ ప్రాణాలు తీసుకునేందుకు కారణమయ్యాయని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

వివరాలు 

ఆత్మహత్యను ప్రోత్సహించే ఉద్దేశ్యం తమ బాట్లకు లేదు 

కానీ ఓపెన్‌ఏఐ తాజాగా ఈ ఆరోపణలను తప్పుబడుతూ, యువకుడి మరణానికి చాట్‌జిపిటి బాధ్యత వహించదని స్పష్టం చేసింది. కంపెనీ ప్రకారం, ఆడమ్‌తో దాదాపు తొమ్మిది నెలల పాటు జరిగిన మాటల మార్పిడిలో, చాట్‌జిపిటి అతనికి వందకు పైగా సార్లు మానసిక సహాయం కోసం నిపుణులను సంప్రదించమని సూచించిందని పేర్కొంది. ఆత్మహత్యను ప్రోత్సహించే ఉద్దేశ్యం తమ బాట్లకు లేదని, అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడల్లా వాటికి వ్యతిరేకంగా సురక్షిత సూచనలే ఇస్తాయని ఓపెన్‌ఏఐ వివరణ ఇచ్చింది.

వివరాలు 

ఆత్మహత్య పద్ధతులను చాట్‌బాట్ సూచించింది 

ఇక ఆడమ్ కుటుంబం మాత్రం విభిన్న వాదన చేస్తోంది. భద్రతా నియమాలు తప్పించుకునేలా ఆడమ్ ప్రవర్తించిన తర్వాత, చాట్‌జిపిటి ఆత్మహత్యకు సంబంధించిన వివరణాత్మక మార్గాలు తెలిపిందని వారు ఆరోపిస్తున్నారు. మాదకద్రవ్యాల అధిక మోతాదు, మునిగిపోవడం, కార్బన్‌ మోనాక్సైడ్ వాయువును ఉపయోగించడం వంటి ఆత్మహత్య పద్ధతులను చాట్‌బాట్ సూచించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిని "అందమైన ముగింపు" అని అభివర్ణిస్తూ టీనేజర్‌ను ప్రేరేపించిందని కుటుంబం అంటోంది. ఈ ప్రభావంతో ఆడమ్ ఆత్మహత్యా నోట్ కూడా రాశాడని తల్లిదండ్రులు తెలిపారు. తమ బిడ్డ మానసిక దృఢత్వాన్ని చాట్‌బాట్ దెబ్బతీసిందని వారు బాధ వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు 

ఓపెన్‌ఏఐ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు 

కంపెనీ మాత్రం యూజర్ నిబంధనలు ఉల్లంఘించడమే ఈ పరిణామానికి కారణమని వాదిస్తోంది. హెచ్చరికలను ఆడమ్ పట్టించుకోలేదని పేర్కొంది. ఓపెన్‌ఏఐ బాధిత కుటుంబానికి బ్లాగ్ పోస్ట్ ద్వారా సానుభూతి తెలియజేసినా, కేసులో చేస్తున్న ఆరోపణలు అసంపూర్ణ సమాచారం ఆధారంగా ఉన్నాయని స్పష్టం చేసింది. బాధిత కుటుంబ న్యాయవాది జే అడెల్సన్ మాట్లాడుతూ, కంపెనీ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సరైన పరీక్షలు లేకుండానే GPT-40ను మార్కెట్లోకి విడుదల చేశారని వచ్చిన ఆరోపణలపై కూడా కంపెనీ నిశ్శబ్దంగా ఉందని విమర్శించారు. ఆడమ్ మరణానికి గంటల ముందు ఉన్న చాట్ హిస్టరీకి సంబంధించి, చాట్‌జిపిటి అతన్ని ఎలా ప్రోత్సహించిందన్న విషయానికి ఓపెన్‌ఏఐ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని న్యాయవాది పేర్కొన్నారు.

Advertisement