Open AI: నేటి నుండి వినియోగదారులందరికీ అందుబాటులో ఓపెన్ఏఐ చాట్‌జిపిటి AI సెర్చ్ ఇంజిన్
చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) సెర్చ్ ఇంజిన్ రంగంలో గూగుల్ ఆధిపత్యానికి పోటీగా తమ సొంత సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు కేవలం సబ్‌స్క్రిప్షన్ యూజర్లకే అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని ఇప్పుడు అందరికీ ఉచితంగా ఉపయోగించే అవకాశం కల్పించింది. అంటే, ఇకపై చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజిన్‌ను ఉపయోగించేందుకు సబ్‌స్క్రిప్షన్ అవసరం ఉండదు. దీనికి అనేక కొత్త ఫీచర్లు, మెరుగైన సదుపాయాలు జోడించినట్లు ఓపెన్‌ఏఐ ఇటీవల నిర్వహించిన ఈవెంట్‌లో ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా, చాట్‌జీపీటీ ఆప్టిమైజ్డ్ వెర్షన్‌ను విడుదల చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్ల వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తోంది.
ఈ ఫీచర్‌ను ప్రతి యూజర్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు
అడ్వాన్స్‌డ్ వాయిస్ సెర్చ్ మోడ్ ఫీచర్ కూడా ఇందులో భాగం, దీని ద్వారా వాయిస్ కమాండ్ల సాయంతో ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందవచ్చు. ఈ ఫీచర్‌ను లాగిన్ అయిన ప్రతి యూజర్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. తాజాగా నిర్వహించిన ఈవెంట్‌లో, వాయిస్ మోడ్‌కు రియల్-టైమ్ వీడియో మరియు స్క్రీన్ షేరింగ్ సామర్థ్యాలను కూడా చేర్చినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్లు క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడటంతో పాటు, ఫీడ్‌బ్యాక్ పొందేందుకు కూడా ఉపయోగపడతాయి. చాట్ విండోలో ఎడమవైపున ఉన్న వీడియో ఐకాన్ ద్వారా వీడియో ఫీచర్‌ను ప్రారంభించవచ్చు, అలాగే త్రీడాట్స్ మెనూ ద్వారా స్క్రీన్ షేరింగ్ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్లు ప్రస్తుతం చాట్‌జీపీటీ టీమ్స్, ప్లస్, ప్రో సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉన్నాయి.
2023 నవంబర్‌లోనే చాట్‌జీపీటీ సెర్చ్
ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సపోర్ట్ చేస్తూ, 2024 జనవరి నుంచి చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్, Edu సబ్‌స్క్రైబర్లకు ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఓపెన్‌ఏఐ సంస్థ 2023 నవంబర్‌లోనే చాట్‌జీపీటీ సెర్చ్‌ను ప్రారంభించింది. ఇంతకుముందు చాట్‌జీపీటీ కేవలం డేటాబేస్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందించగలిగింది. అయితే ఇప్పుడు, సెర్చ్ ఇంజిన్ ద్వారా వెబ్‌లోని సమాచారాన్ని సేకరించి సమాధానాలు ఇవ్వడంతో పాటు, ఫాలో-అప్ ప్రశ్నలకు కూడా సమాధానం అందిస్తోంది.