OpenAI: 4.6 బిలియన్ డాలర్లతో సిడ్నీలో ఏఐ కేంద్రం నిర్మించనున్న ఓపెన్ఏఐ
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలో మొదటి కార్యాలయం ప్రారంభిస్తున్న నేపథ్యంలో,ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐ సిడ్నీలో భారీ డేటా సెంటర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును ఆస్ట్రేలియా డేటా సెంటర్ ఆపరేటర్ నెక్స్‌టిడీసీ లిమిటెడ్‌తో కలసి చేపట్టనున్నట్లు ప్రకటించింది. సుమారు 7 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు 4.6 బిలియన్ అమెరికన్ డాలర్లు) వ్యయంతో అత్యాధునిక కంప్యూటింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది OpenAI - నెక్స్‌టిడీసీ సంస్థల మధ్య కుదిరిన ఏఐ మౌలిక వసతుల భాగస్వామ్యంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్ట్.
వివరాలు
భారీగా పెరిగిన నెక్స్‌టిడీసీ షేర్ ధరలు
ఈ ప్రకటన వెలువడిన వెంటనే నెక్స్‌టిడీసీ షేర్ ధరలు భారీగా పెరిగాయి. ఆస్ట్రేలియాలో ఏఐ రంగంలో ఉన్న వేగవంతమైన పురోగతే ఈ పెట్టుబడికి కారణమని OpenAI చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జేసన్ క్వాన్ తెలిపారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతం మొత్తం మీద అత్యుత్తమ ఏఐ మోడళ్లకు ఉపయోగపడే ఆధునిక నిర్మాణ సదుపాయాలు ఈ కేంద్రంలో ఉండనున్నాయని చెప్పారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టిన OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలతో భాగస్వామ్యాలు పెంచుకుంటుండగా, గూగుల్, మెటా వంటి దిగ్గజాలతో పోటీ మరింత పెరుగుతోంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ప్రాంతీయ స్థాయిలో కీలక డేటా సెంటర్ హబ్‌గా మారుతూ కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తోంది.