
Perplexity CEO: ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగ్ మానేసి ఏఐ టూల్స్ నేర్చుకోండి.. యువతకు పర్‌ప్లెక్సిటీ CEO సూచన
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం స్క్రోల్ చేయడాన్ని తగ్గించుకుని, దాని బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ను ఉపయోగించడం నేర్చుకోవాలని యువత (జెన్ జడ్) కు పర్‌ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ సూచించారు. ప్రముఖ టెక్ జర్నలిస్ట్ మాథ్యూ బెర్మాన్‌తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐను సరిగ్గా వినియోగించగలవారికి ఉద్యోగ మార్కెట్‌లో మరింత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఏఐ విప్లవంలో మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలోనే భారీ మార్పులు సంభవిస్తున్నాయని, ఈ గమనాన్ని పట్టించుకోకుండా వెనకబడి పోతే ఉద్యోగ అవకాశాల పరంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
వివరాలు
ఏఐతో రిక్రూటర్ల స్థానం భర్తీ
''సాంకేతికతతో పాటు ఎదగడం అంత సులువు కాదు. ఇప్పటివరకు మానవాళి ఇంత వేగంగా మార్పులకు అనుగుణంగా ముందుకు వెళ్లిన సందర్భాలు చాలా అరుదుగా కనిపించాయి'' అని శ్రీనివాస్ వివరించారు. 'ది వెర్జ్' సంస్థ నిర్వహించిన డీకోడర్ పాడ్‌కాస్ట్ తాజా ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. పర్‌ప్లెక్సిటీ సంస్థ అభివృద్ధి చేసిన కామెట్ బ్రౌజర్ అనే ఏఐ టూల్ భవిష్యత్తులో మానవ రిక్రూటర్ల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేసే స్థాయికి ఎదగవచ్చని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఏఐతో రిక్రూటర్ల స్థానం భర్తీ
''ఒక రిక్రూటర్ వారం రోజులపాటు చేసే పనిని ఒక మంచి ప్రాంప్ట్‌తో పూర్తిచేసే స్థాయికి ఈ ఏఐ టూల్స్ చేరుకుంటాయి. అభ్యర్థుల వివరాలు సేకరించడం, వారికి ఈమెయిల్ పంపించడం, వారి స్పందనను ట్రాక్ చేయడం, గూగుల్ షీట్లలో స్టేటస్ అప్‌డేట్ చేయడం, ఫాలోఅప్‌లివ్వడం, క్యాలెండర్‌తో సింక్ చేయడం, మీటింగ్‌కు ముందు బ్రీఫ్ పంపించడం వంటి పనులు అన్ని ఆటోమేటిక్‌గా పూర్తయ్యేలా చేయడమే నేటి ఏఐ టూల్స్ లక్ష్యం'' అని వివరించారు. ప్రస్తుతం కామెట్ బ్రౌజర్‌ను పర్‌ప్లెక్సిటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికే అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. త్వరలో ఉచిత యూజర్లకూ ఆహ్వానాలు పంపడం ప్రారంభించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
వివరాలు
ఎవరీ అరవింద్ శ్రీనివాస్?
అరవింద్ శ్రీనివాస్ భారతదేశానికి చెందిన యువ పారిశ్రామికవేత్త, కంప్యూటర్ శాస్త్రవేత్త. ప్రతిరోజూ వినియోగించదగ్గ కన్వర్సేషనల్ సర్చ్ టూల్స్ అభివృద్ధి దిశగా పనిచేస్తున్న పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థకు ఆయన సహ వ్యవస్థాపకుడు, CEO.