
WhatsApp new feature: వాట్సప్ యూజర్లకు రిలీఫ్.. ఇప్పుడు మీ ఫొటోలు ఎవరు సేవ్ చేయలేరు!
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ తన యూజర్లకు మరింత గోప్యత కలిగిన అనుభవాన్ని అందించేందుకు కొత్త ప్రైవసీ ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.
ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్లపై సమాచారం అందజేసిన వాబీటా ఇన్ఫో ప్రకారం, యూజర్లు పంపే ఫోటోలు, వీడియోలను అవతలవారి గ్యాలరీలో సేవ్ చేసుకోకుండా నిరోధించే సదుపాయాన్ని వాట్సప్ తీసుకురానుంది.
ఇదివరకు వన్‌టైమ్ వ్యూ ఆప్షన్ ద్వారా పంపిన మీడియాను ఒక్కసారి మాత్రమే వీక్షించగలగడం సాధ్యమైంది.
అయితే, తాజా ఫీచర్ ద్వారా ఏ మాధ్యమమైనా ఫోటో లేదా వీడియో అవతలి వ్యక్తి గ్యాలరీలో సేవ్ చేసుకోవడం సాధ్యపడదు. ఈ ఆప్షన్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఉంటుంది.
యూజర్ దీన్ని ఆన్ చేసినట్లయితే, మీడియాను సేవ్ చేయాలనుకున్నవారికి 'సేవ్ చేయడం కుదరదు' అనే సందేశం కనిపిస్తుంది.
Details
చాట్ హిస్టరీ ఎక్స్‌పోర్ట్ లో కీలక మార్పు
అవసరమైతే, అదే ఆప్షన్‌ను ఆఫ్ చేసి సేవ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఇక చాట్ హిస్టరీ ఎక్స్‌పోర్ట్ విషయంలోనూ మరో కీలక మార్పు రానుంది.
అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ సెట్టింగ్‌ను యూజర్ ఆన్ చేస్తే, చాట్ హిస్టరీని ఎక్స్‌పోర్ట్ చేయడం అవతలి వ్యక్తికి సాధ్యపడదు. ఇది ఇప్పటికే ఉన్న డిస్‌అపియరింగ్ మెసేజ్‌ల ఫీచర్ కంటే భిన్నంగా పనిచేస్తుంది.
డిస్‌అపియరింగ్ ఫీచర్ ద్వారా సెట్ చేసిన కాలవ్యవధి తర్వాత సందేశాలు తొలగిపోతాయి. కానీ కొత్త ఫీచర్‌లో, ఎక్స్‌పోర్ట్‌ను పూర్తిగా నిరోధించవచ్చు.
ఈ ఫీచర్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, వాట్సప్ బీటా ప్రోగ్రామ్‌లో ఉన్నవారికీ ఇంకా అందుబాటులోకి రాలేదని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.
ఉపయోగకరమైన ఈ ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రావొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.