Page Loader
Nasa: చంద్రుడిపై వ్యర్థాలు తొలగించండి.. నాసా నుంచి రూ.25 కోట్లు ఆఫర్! 
చంద్రుడిపై వ్యర్థాలు తొలగించండి.. నాసా నుంచి రూ.25 కోట్లు ఆఫర్!

Nasa: చంద్రుడిపై వ్యర్థాలు తొలగించండి.. నాసా నుంచి రూ.25 కోట్లు ఆఫర్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రుడిపై ఇప్పటికీ దాగి ఉన్న అనేక రహస్యాలను కనుగొనాలనే లక్ష్యంతో ఎన్నో దేశాలు ఎన్నో ఏళ్లుగా నిరంతరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) సుమారు 50 సంవత్సరాలుగా చంద్రుడిపై తన వ్యోమగాములను పంపిస్తూ వస్తోంది. అయితే ఈ ప్రయోగాల్లో ఒక సమస్యను గుర్తించారు. అదే చంద్రుడిపై మానవ వ్యర్థాల పేరుతో ఏర్పడిన విపరీతమైన మలినాలు. ఇందుకోసం నాసా తాజాగా ఓ వినూత్న ప్రతిపాదనతో ముందుకొచ్చింది. చంద్రుడిపై పేరుకుపోయిన మానవ వ్యర్థాలను తొలగించేందుకు లేదా వాటిని పునఃప్రయోజనంగా మార్చేందుకు సమర్థవంతమైన పరిష్కారం తెలియజేస్తే, దానికి ప్రతిఫలంగా 3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 కోట్లు) అందజేస్తామని ప్రకటించింది.

Details

96 సంచుల మానవ వ్యర్థాలు

నాసా తన తొలి చంద్రయాత్రలను 1969 నుంచి 1972 మధ్యకాలంలో ఆపోలో మిషన్ల (Apollo Missions) ద్వారా నిర్వహించింది. ఆరుసార్లు జరిగిన విజయవంతమైన ల్యాండింగ్స్‌లో వ్యోమగాములు చంద్రుడిపై పరిశోధనలు నిర్వహించి, అక్కడి నుండి కొంత భాగాన్ని నమూనాలుగా భూమికి తీసుకువచ్చారు. అయితే లూనార్ మాడ్యూల్‌లో నిల్వ స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకొని, అవసరం లేని వస్తువులను, ముఖ్యంగా మానవ వ్యర్థాలను, చిన్న చిన్న బ్యాగుల్లో పెట్టి చంద్రుడిపై విడిచివచ్చారని నాసా తాజాగా వెల్లడించింది. ఈ విధంగా మొత్తం 96 సంచుల మానవ వ్యర్థాలు ప్రస్తుతం చంద్రుడిపై ఉన్నాయని సమాచారం. వీటిని శాశ్వతంగా తొలగించాల్సిన అవసరం ఉందని భావించిన నాసా, 'లూనరీ సైకిల్ ఛాలెంజ్‌' పేరిట ఓ గ్లోబల్ కాంపిటీషన్‌ను ప్రారంభించింది.

Details

3 మిలియన్ డాలర్ల బహుమతి

ఈ ఛాలెంజ్‌లో, చంద్రుడిపై ఉన్న వ్యర్థాలను నీరు, శక్తి లేదా ఎరువుగా మారుస్తూ, భవిష్యత్తు మానవ నివాసాలకు అనుకూలంగా ఉపయోగపడే విధంగా పునర్వినియోగానికి సరిపడే ఐడియాలను కోరుతోంది. విజేతలకు 3 మిలియన్ డాలర్ల బహుమతి అందజేస్తామని తెలిపింది. ఈ సమస్య చంద్రుడిపైనే కాకుండా, అంతరిక్ష ప్రయాణాల్లోనూ ఉన్నదే. వ్యోమగాములు తమ ఉపయోగించిన వస్తువులను రీసైక్లింగ్ చేసి మళ్లీ వినియోగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మానవ సంబంధిత వ్యర్థాలను నిర్మూలించడం లేదా భూమిపైకి తిరిగి తీసుకురావడం ఒక పెద్ద సవాలే. అందుకే నాసా ఈ ఛాలెంజ్ ద్వారా భవిష్యత్తులో చంద్రుడిపై మానవ జీవన విధానాన్ని మెరుగుపరచడంలో మైలురాయిగా నిలిచే కొత్త ఆవిష్కరణల కోసం ప్రపంచాన్ని ఆహ్వానిస్తోంది.