రేపే సూర్యగ్రహణం: ఆకాశంలో ఉంగరం ఆకారంలో కనిపించనున్న సూర్యుడు
ఆకాశంలో ఏర్పడే ప్రతి విషయంపైన మనిషికి ఎంతో ఆసక్తి ఉంటుంది. అందుకే సూర్య, చంద్ర గ్రహణాలు చాలా ఫేమస్ అయ్యాయి. గ్రహణం ఎప్పుడు సంభవించినా కూడా ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఆకాశంలో మరోసారి గ్రహణం కనిపించే సమయం ఆసన్నమైంది. 2023 సంవత్సరంలో అక్టోబర్ 14వ తేదీన సూర్యగ్రహణం చోటు చేసుకోనుంది. శనివారం రోజున చోటు చేసుకోబోయే ఈ సూర్యగ్రహణాన్ని అగ్ని వలయం అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ సూర్యగ్రహణాన్ని అమెరికా నగరాల నుండి చూడవచ్చు. రేపు చోటు చేసుకోబోయే సూర్య గ్రహణాన్ని అగ్ని వలయం అనడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఉంగరం ఆకారంలో కనిపించనున్న సూర్యుడు
సూర్యుడు, భూమి మధ్యకు చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడు ఉంగరం ఆకారంలో కనిపిస్తాడు. అందువల్ల ఈ సూర్యగ్రహణాన్ని అగ్ని వలయం అని పిలుస్తున్నారు. ఇలాంటి సూర్య గ్రహణాలు సంవత్సరాల కాలంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి. అగ్ని వలయంగా పిలుచుకునే ఈ సూర్యగ్రహనాన్ని భారతదేశ ప్రజలు చూడలేరు. అమెరికా ప్రాంత ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ సూర్యగ్రహణం అమెరికాలోని ఒరేగాన్ ప్రాంతంలో ఉదయం 9:13 గంటలకు మొదలవుతుంది. ఆ తర్వాత టెక్సాస్ ప్రాంతంలో మధ్యాహ్నం 12: 03 గంటలకు పూర్తవుతుంది. అంతేకాదు ఈ గ్రహణాన్ని కోస్టారికా, పనామా, కొలంబియా, బ్రెజిల్ దేశాల ప్రజలు చూడవచ్చు.