Cancer Vaccine: కేన్సర్ టీకాపై పరిశోధనల్లో కీలక ముందడుగు.. వ్యాక్సిన్ తయారుచేసినట్టు ప్రకటించిన రష్యా
క్యాన్సర్ పై ఔషధాల పరిశోధనలో కీలక ముందడుగు పడింది. ప్రపంచాన్ని భయపెడుతున్న కేన్సర్ వ్యాధికి వ్యాక్సిన్ ద్వారా చెక్ పెట్టడంలో చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయని రష్యా తాజాగా ప్రకటించింది. రష్యా కేన్సర్ వ్యాధికి టీకా అభివృద్ధి చేసిందని వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి మార్కెట్‌లోకి తీసుకురానుందని తెలిపింది. మొదట, తమ దేశ పౌరులకు ఉచితంగా ఈ వ్యాక్సిన్లు అందజేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి ధ్రువీకరించారు. జనవరి 2025 నుంచి పౌరులకు వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని తెలిపారు. రష్యా అధికారిక మీడియా TASS ప్రకారం, రేడియాలజీ మెడికల్ రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఆండ్రీ కప్రిన్ కేన్సర్ టీకా గురించి వివరాలు వెల్లడించారు.
టీకా పనితీరును ధ్రువీకరించిన గమలేయా ఇన్‌స్టిట్యూట్
గమలేయా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ ఈ టీకా గురించి మాట్లాడుతూ,ఇది కేన్సర్ వ్యాప్తిని నిరోధించగలదని అన్నారు. మొదట కేన్సర్ బాధితుల చికిత్సలో ఈ టీకాను ఉపయోగించి, తరువాత సాధారణ ప్రజలకు అందించనున్నామని చెప్పారు. ఈ టీకా అన్ని రకాల కేన్సర్లపై సమర్ధవంతంగా పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ మెడికల్ రిసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్, గమలేయా ఇన్‌స్టిట్యూట్ ఈ టీకా పనితీరును ధ్రువీకరించాయి. కానీ, ఈ టీకా ఏ రకమైన కేన్సర్ చికిత్సకు ఉపయోగపడుతుందో, దాని ప్రభావం ఎంత వరకూ ఉంటుందో ఇంకా స్పష్టం చేయలేదు. కేన్సర్ వ్యాధికి శాస్త్రీయంగా టీకా అభివృద్ధి సాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కేన్సర్ టీకాలను తయారు చేసే ప్రక్రియను మరింత వేగవంతం
ఇప్పటికే చాలా దేశాలు ఈ పరిశోధనలో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో, రష్యా ఈ రంగంలో అందరి కంటే ముందుంది. కోవిడ్-19 టీకా విడుదల చేసిన సమయంలో ప్రపంచానికి ముందుగా రష్యానే టీకాను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగం చేయగా, కేన్సర్‌ను నివారించే కొత్త టీకాలు, ఔషధాల అభివృద్ధి దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు. కృత్రిమ మేధ వినియోగం కేన్సర్ టీకాలను తయారు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.