భూగర్భ జలాలను భారీగా తోడటంతో 80 సెం.మీ వంగిన భూమి
భూగర్భ జలాలను పరిధికి మించి తోడటం వల్ల భూమి భ్రమణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్ ప్రచురించిన అధ్యయనం చెబుతోంది. 1993 నుంచి 2010 మధ్య సంవత్సరానికి 4.36 సెంటీమీటర్ల వేగంతో డ్రిఫ్ట్ ఏర్పడినట్లు అధ్యయనం పేర్కొంది. మంచు పలకలు కరగడం, సముద్ర మట్టం పెరగడానికి భూగర్భ జలాలు తగ్గడం కూడా ఒక కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1993 నుంచి 2010 మధ్య దాదాపు 2,150 గిగాటన్‌ల భూగర్భ జలాలను మానవులు వెలికి తీసినట్లు అధ్యయనం చెబుతోంది. ఇది సముద్ర మట్టం 0.24 అంగుళాల కంటే ఎక్కువ పెరగడంతో సమానమని పరిశోధకులు అంటున్నారు.
నీరు భూమి భ్రమణాన్ని మార్చగలదనే 2016లో తెలుసుకున్న శాస్త్రవేత్తలు
భారతదేశం, అమెరికాలో పెరుగుతున్న భూగర్భజల దోపిడీ వల్ల పోల్ డ్రిఫ్టింగ్‌కు దారితీసిందనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫలితంగా భూమి తూర్పు వైపు 80 సెంటీమీటర్లకు పైగా వంగినట్లు పేర్కొన్నారు. దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్శిటీలో జియోఫిజిసిస్ట్ కి-వీన్ సియో మాట్లాడుతూ భూమి భ్రమణ ధ్రువం చాలా మారుతుందని స్పష్టం చేశారు. నీరు భూమి భ్రమణాన్ని మార్చగలదనే వాస్తవాన్ని శాస్త్రవేత్తలు 2016లో కనుగొన్నారు. అంతకుముందు భూమి కదలికలను కొలిచేటప్పుడు మంచు పలకలు, హిమానీనదాలను మాత్రమే పరిగణించేవారు. ఇప్పుడు భూగర్భజలాలు కూడా పెద్ద అంశంగా పరిగణించబడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూగర్భజలాల క్షీణత రేటును తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, కొన్ని దశాబ్దాల పాటు ఆ ప్రయత్నం సాగితే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకుల అభిప్రాయపడుతున్నారు.