
Shubhanshu Shukla: సురక్షితంగా ఐఎస్ఎస్ చేరడంలో ఇస్రో బృందం చేపట్టిన కృషికి శుభాన్షు శుక్లా కృతజ్ఞతలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రయాణించిన భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ వీ. నారాయణన్‌తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఆయన ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా ISS వెళ్లిన విషయం తెలిసిందే. తన ప్రయాణం సురక్షితంగా కొనసాగడానికి ఇస్రో ఇచ్చిన సహకారానికి శుక్లా కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెలిఫోన్ సంభాషన జూలై 6వ తేదీ మధ్యాహ్నం జరిగినట్లు ఇస్రో వెల్లడించింది. శుక్లా ఆరోగ్య పరిస్థితి గురించి చైర్మన్ వీ. నారాయణన్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో జరుగుతున్న శాస్త్రీయ పరిశోధనలపై కూడా ఆయన ఆరా తీశారు.
వివరాలు
శుక్లా అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయని ఇస్రో అంచనా
ISSలో జరుగుతున్న అన్ని పరిశోధనలు, కార్యక్రమాలపట్ల శుక్లాకు వచ్చిన అనుభవాలను క్రమంగా డాక్యుమెంట్ చేయాలన్న అభిప్రాయాన్ని ఇస్రో చైర్మన్ వ్యక్తపరిచారు. గగన్‌యాన్ ప్రోగ్రాం అమలులో ఉన్న ఈ సమయంలో, శుక్లా అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయని ఇస్రో అంచనా వేస్తోంది.