2025లో సౌర తుఫాన్లును నేటి ఇంటర్నెట్ కాలం తట్టుకోకపోవచ్చు
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సోలార్ సైక్లోన్స్ (సౌర తుఫాన్లు) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు భానుడి ధాటికి భూమి మండిపోతోంది. 2025లో ఆ భగభగలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ ఓ ఆర్టికల్ ను ప్రచురించింది. ఆ వేడిని తట్టుకునే రీతిలో నేటి డిజిటల్ సమాజం లేదని వెల్లడించారు. దీనిపై నెట్టింట కామెంట్లు ఊపందుకున్నాయి. ఇంటర్నెట్ కాలానికి యుగాంతం ఏర్పడే రోజులు దగ్గర పడ్డట్లు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు. 2025లో సౌర తుఫాన్ల వల్ల అంతర్జాలం కనెక్షన్లకు సమస్యలు వాటిల్లే అవకాశాల గురించి నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ప్రతిరోజు కనీసం 11 బిలియన్ల డాలర్ల మేర నష్టం
సౌర తుఫాన్లు తీవ్రంగా ఉంటే ఎలా ఉంటుందన్న పరిస్థితిని ఇప్పటి వరకు ఎదుర్కోలేదని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఐటీ ప్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటో ఇప్పుడే చెప్పలేమన్నారు. అసలు ఆ తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేయలేమని ఆమె చెప్పారు. సోలార్ సూపర్ స్టార్మ్స్ కి సంబంధించి ప్లానింగ్ ఫర్ ఆన్ ఇంటర్నెట్ అపోకలిప్స్ టైటిల్‌తో జ్యోతి రాసిన రిపోర్ట్ చర్చకు దారి తీసింది. తీవ్రమైన సౌర తుఫాన్ల వల్ల సముద్ర గర్భంలో ఉన్న సమాచార కేబుళ్లు సైతం దెబ్బతినే ముప్పు ఉందన్నారు. సూర్యుడు తన ప్రతాపాన్ని కొన్ని నెలలుగా చూపనున్నాడన్నారు. ప్రతిరోజు కనీసం 11 బిలియన్ల డాలర్ల మేర నష్టం వాటిల్లనుందన్నారు.