ISRO Chief: సోమనాథ్ కీలక ప్రకటన.. 2026లో గగన్‌యాన్, 2028లో చంద్రయాన్-4 లాంచ్
ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ స్మారక ఉపన్యాసంలో ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ రాబోయే మిషన్లకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. 2026లో ప్రారంభమయ్యే గగన్‌యాన్ మిషన్‌తో భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్రకు అడుగు పెడుతోందన్నారు. 2028లో చంద్రయాన్ -4 ద్వారా చంద్రుని నుంచి నమూనాలను తిరిగి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. భారతదేశం-అమెరికా సంయుక్తంగా చేపట్టిన NISAR మిషన్ వచ్చే ఏడాదికి షెడ్యూల్ చేశామన్నారు. జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా భాగస్వామ్యంతో చంద్రయాన్-5 మిషన్ కింద కొత్త మూన్ ల్యాండింగ్ ప్రాజెక్టును చేపడతామనీ, ఇది LUPEX (లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్) పేరుతో మొదట ప్రకటించామని చెప్పారు.
చంద్రునిపై అధునాతన శాస్త్రీయ పరిశోధనలు
అయితే చంద్రయాన్-4గా దీన్ని పునర్నామకరణం చేసినట్లు సోమనాథ్ తెలిపారు. ఈ మిషన్ ప్రారంభానికి సంబంధించి నిర్దిష్ట తేదీ ఇంకా నిర్ణయించలేదు. కానీ 2028 తర్వాత ఆ అవకాశం ఉందని సూచించారు. చంద్రయాన్-5లో జపాన్ నుంచి 350 కిలోల భారీ రోవర్‌ను ఉపయోగించనున్నారు, ఇది చంద్రునిపై అధునాతన శాస్త్రీయ పరిశోధనలు జరుపుతుందని సోమనాథ్ వివరించారు. ఇది భారతదేశాన్ని 2040 నాటికి చంద్రునిపై మానవ సహిత యాత్రకు మరింత దగ్గరగా తీసుకువెళ్లే పథంలో ముఖ్యమైన మిషన్ అని ఆయన తెలిపారు.
స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలను విస్తరించడం, యువ పారిశ్రామికవేత్తల చొరవ భారత అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతోందన్నారు. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారతీయ వాటాను 10 శాతానికి పెంచేందుకు ఇస్రో సిద్ధమవుతోందని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల్లో, భారతదేశం అంతరిక్ష సాంకేతికత దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించిందని, అయితే ఇంకా స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సోమనాథ్ అన్నారు.