Loading...
SpaceX Starship: చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌ - స్టార్‌షిప్‌ను ఇలా పట్టేసుకుంది
చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌ - స్టార్‌షిప్‌ను ఇలా పట్టేసుకుంది

SpaceX Starship: చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌ - స్టార్‌షిప్‌ను ఇలా పట్టేసుకుంది

వ్రాసిన వారు Balachander Sharma
Nov 15, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్న భారీ స్టార్‌షిప్‌ను నేలను తాకకముందే గాల్లో పట్టుకోవడం ద్వారా స్పేస్‌ఎక్స్ మరో సంచలనం సృష్టించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ సంస్థ టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌ నుంచి ప్రయోగించిన స్టార్‌షిప్‌ను లాంచ్ టవర్‌కు అమర్చిన 'మెకాజిల్లా' భారీ చేతులతో సురక్షితంగా ఒడిసిపట్టుకుంది. మండే వేడితో నల్లగా మారిన వ్యోమనౌక మళ్లీ భూమిపైకి చేరి, గాల్లోనే నిలిచిన ఆ దృశ్యం అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

Details

22 గంటల ప్రయాణం.. 26 స్టార్‌లింక్ ఉపగ్రహాలు

124 మీటర్ల భారీ రాకెట్‌ శుక్రవారం స్టార్‌బేస్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.

పైభాగంలోని స్టార్‌షిప్ కక్ష్యలోకి చేరిన తర్వాత 26 స్టార్‌లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా విడుదల చేసింది.

భూమికి సుమారు 265 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ 22 గంటల పాటు మిషన్ కొనసాగించింది.

ఈ సమయంలో భూమి చుట్టూ 14 సార్లు తిరిగింది. స్టార్‌లింక్ ద్వారా అంతరిక్షం నుంచి భూమి దృశ్యాలను ప్రత్యక్షంగా ప్రసారం చేయడం కూడా ఈ మిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Details

బూస్టర్ విఫలమైనా.. అసలు లక్ష్యం మాత్రం సక్సెస్

ఈ ప్రయోగంలో మొదటి దశ బూస్టర్ మాత్రం విఫలమైంది. ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే అది పేలిపోయి, దాని శకలాలు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడ్డాయి.

గతంలో బూస్టర్లను మూడుసార్లు విజయవంతంగా పట్టుకున్న స్పేస్‌ఎక్స్‌కు ఈసారి ఆ ప్రయత్నం ఫలించలేదు.

కానీ స్టార్‌షిప్‌ను సురక్షితంగా తిరిగి తీసుకురావడం ద్వారా సంస్థ కీలక విజయాన్ని అందుకుంది.

ముఖ్యంగా వేడిని తట్టుకునే హీట్‌షీల్డ్‌తో సహా వ్యోమనౌకలోని ప్రధాన వ్యవస్థలు విజయవంతంగా పనిచేశాయి.

ADVERTISEMENT

Details

రాకెట్లను విమానాల్లా మళ్లీ వాడే లక్ష్యం

2023 నుంచి స్టార్‌షిప్‌కు ఇది 15వ ప్రయోగం కాగా, కక్ష్యలోకి వెళ్లడం రెండోసారి.

అంతరిక్షానికి వెళ్లిన రాకెట్‌ను తిరిగి తీసుకొచ్చి, మరో ప్రయోగానికి త్వరగా సిద్ధం చేయడం స్పేస్‌ఎక్స్‌ ప్రధాన లక్ష్యం.

ఇలా చేయగలిగితే ఒక్కో రాకెట్‌ ప్రయోగానికి అయ్యే ఖర్చు భారీగా తగ్గుతుంది. ప్రస్తుతం స్టార్‌లింక్‌ సేవల విస్తరణతో పాటు భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడి మిషన్లకు కూడా ఈ సాంకేతికత కీలకంగా మారే అవకాశం ఉంది.

నేలను తాకకముందే స్టార్‌షిప్‌ను గాల్లో పట్టుకున్న ఈ ప్రయోగం ఆ లక్ష్యానికి మరింత దగ్గర చేసింది.

ADVERTISEMENT