PM2.5 component: PM2.5 కాంపోనెంట్‌తో పిల్లలలో అభ్యసన నైపుణ్యాలు,జ్ఞాపకశక్తికి గండి!..అధ్యయనం
అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ప్రకారం, వాతావరణంలో ఉండే పీఎం2.5 రేణువుల్లో ప్రధానమైన అమ్మోనియం నైట్రేట్ చిన్నారుల అభ్యసన నైపుణ్యాలు, జ్ఞాపకశక్తిపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని తేల్చింది. వాయు నాణ్యతా నియంత్రణలను మెరుగుపరచడం ద్వారా దీర్ఘకాల నాడీ సమస్యలను అర్థం చేసుకోవడం కోసం ఈ పరిశోధన అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. పీఎం2.5 రేణువులు ధూళి, నుసి, సేంద్రియ పదార్థాలు, లోహాల మిశ్రమంతో ఏర్పడతాయి. ఇవి 2.5 మైక్రోమీటర్ల కన్నా చిన్నగా ఉంటాయి, శ్వాసకృత్య వ్యవస్థలోకి వెళ్లి, రక్తప్రవాహంలో కలిసిపోతాయి, చివరికి మెదడులో ప్రవేశించి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
అల్జీమర్స్, డిమెన్షియా వంటి వృద్ధాప్య నాడీ సంబంధ రుగ్మతల ముప్పు
వ్యవసాయ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే అమ్మోనియా వాయువు, శిలాజ ఇంధనాల ప్రజ్వలనతో ఉత్పత్తయ్యే నైట్రిక్ ఆమ్లం పరస్పర చర్య చేసుకుంటే అమ్మోనియం నైట్రేట్ తయారవుతుంది. ఈ పదార్థం పీఎం2.5 రేణువుల్లో ఎక్కువగా ఉంటుంది. పూర్వ అధ్యయనాల ప్రకారం, అల్జీమర్స్, డిమెన్షియా వంటి వృద్ధాప్య నాడీ సంబంధ రుగ్మతల ముప్పును ఈ రసాయనం పెంచుతుంది. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పీఎం2.5 రేణువుల్లోని 15 రకాల రసాయనాల ప్రభావాన్ని పరిశీలించి, 9-12 ఏళ్ల వయస్సు కలిగిన సుమారు 8,600 మంది చిన్నారులపై ఈ పరిశోధన నిర్వహించారు. అమ్మోనియం నైట్రేట్ రేణువులకు ఎక్కువగా గురైన పిల్లలలో అభ్యసన నైపుణ్యాలు, జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఈ అధ్యయనం ద్వారా తేలింది.