Sunita Williams: సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ ప్రారంభం.. నాసా ప్రత్యక్ష ప్రసారం
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు భూమికి తిరిగిరానున్నారు.
వీరి తిరుగు ప్రయాణానికి సంబంధిత ప్రక్రియ ప్రారంభమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి వీరిని భూమికి తీసుకురావడానికి వెళ్లిన స్పేస్-X క్రూ డ్రాగన్‌లో (SpaceX Crew Dragon) వారు మరికొద్ది సేపట్లో ప్రవేశించనున్నారు.
వివరాలు
తిరుగు ప్రయాణం ప్రారంభం
స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు నాసా (NASA) ప్రకటించింది.
ఈ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. వ్యోమగాములు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారని, తమ సామగ్రిని సర్దుకుంటున్నారని తెలిపింది.
భూమ్మీదకు రాకముందు, ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములంతా ఫొటోలు తీసుకుంటూ మధుర క్షణాలను ఆస్వాదించారు.
నాసాలోని శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను జాగ్రత్తగా గమనిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 గంటలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది.
అనంతరం ఉదయం 10:15 గంటలకు అన్‌డాకింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది.
వివరాలు
సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం
ఇక భూమి వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం బుధవారం తెల్లవారుజామున 2:41 గంటలకు ఇంజిన్లు ప్రజ్వలించనున్నారు.
దాదాపు 40 నిమిషాల తర్వాత, తెల్లవారుజామున 3:27 గంటలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో దిగనుంది.
సహాయ బృందాలు వెంటనే రంగంలోకి దిగి, క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు ఈ ప్రయాణంలో భూమిని చేరుకుంటారు.
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక 'స్టార్‌లైనర్' (Starliner) ద్వారా సునీతా, విల్మోర్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు.
వివరాలు
సునీతా, విల్మోర్ ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయారు
ప్రణాళిక ప్రకారం, వీరు కేవలం ఒక వారం రోజుల్లోనే భూమికి తిరిగిరావాల్సి ఉంది.
అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగొచ్చింది.
ఫలితంగా, సునీతా, విల్మోర్ ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయారు. చివరికి, స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా వీరిని భూమికి తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.