LOADING...
Sunita Williams: 9 నెలల తర్వాత భూమ్మీదకు సునీతా విలియమ్స్.. టైమ్ ప్రకటించిన నాసా
9 నెలల తర్వాత భూమ్మీదకు సునీతా విలియమ్స్.. టైమ్ ప్రకటించిన నాసా

Sunita Williams: 9 నెలల తర్వాత భూమ్మీదకు సునీతా విలియమ్స్.. టైమ్ ప్రకటించిన నాసా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 17, 2025
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపి, ఎట్టకేలకు భూమికి చేరుకోనున్నారు. మరికొన్ని గంటల్లోనే వారి ప్రయాణం మొదలవనుండగా, అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు భూమిపైకి చేరుకునే అవకాశముందని నాసా తాజా అప్‌డేట్‌లో ప్రకటించింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను భూమికి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ ప్రయాణమైంది. ఈ వ్యోమనౌక ఆదివారం భూ కక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో విజయవంతంగా అనుసంధానమైంది. 'క్రూ-10 మిషన్‌'లో భాగంగా వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరుగా ISS‌లోకి ప్రవేశించగా, సునీతా విలియమ్స్ తిరిగి భూమికి రాకకు మార్గం సుగమమైంది.

Details

క్రూ డ్రాగన్‌ తిరుగు ప్రయాణ షెడ్యూల్‌ ఇదే  

సోమవారం రాత్రి 10.45 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) క్రూ డ్రాగన్‌ హ్యాచ్‌ మూసివేత ప్రక్రియ ప్రారంభం. అర్ధరాత్రి 12.45 గంటలకు ISS నుంచి వ్యోమనౌక అన్‌డాకింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమి వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. సాయంత్రం 5.11 గంటలకు భూకక్ష్యను దాటి కిందకు చేరుకుంటుంది. చివరకు సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్రజలాల్లో స్ప్లాష్‌డౌన్‌ అవుతుంది. అనంతరం, వ్యోమగాములను ఒక్కొక్కరుగా బయటకు తీసుకువస్తారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమికి చేరుకోనున్నారు. వారు ఎట్టకేలకు భూమికి తిరిగి రానుండటం సంతోషకరమైన పరిణామమని నాసా వెల్లడించింది.