Page Loader
Supreme Court: నకిలీ వెబ్‌సైట్ల‌తో ఫిషింగ్ దాడులు.. ప్ర‌జ‌ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్
నకిలీ వెబ్‌సైట్ల‌తో ఫిషింగ్ దాడులు.. ప్ర‌జ‌ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్

Supreme Court: నకిలీ వెబ్‌సైట్ల‌తో ఫిషింగ్ దాడులు.. ప్ర‌జ‌ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు ఈ రోజు ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక నోటీసును విడుదల చేసింది. నకిలీ వెబ్‌సైట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సుప్రీంకోర్టు యూఆర్ఎల్ పేరుతో ఫేక్ వెబ్‌సైట్లు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆ నోటీసులో వివరించింది. ఈ నకిలీ వెబ్‌సైట్ల ద్వారా వ్యక్తిగత, గోప్యమైన సమాచారం సేకరించబడుతోందని, ఈ విషయం అత్యున్నత న్యాయస్థానానికి చెందిన రిజిస్ట్రీ కూడా ధృవీకరించింది. ఫిషింగ్ దాడులు జరుగుతున్నాయని, ఇది నిజమేనని రిజిస్ట్రీ పేర్కొంది. సైబర్ నేరగాళ్లు కొన్ని నకిలీ యూఆర్ఎల్స్ ఉపయోగించి వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారని కోర్టు హెచ్చరించింది. ప్రస్తుతం చెలామణి అవుతున్న నకిలీ యూఆర్ఎల్స్ జాబితాను కూడా సుప్రీంకోర్టు విడుదల చేసింది.

వివరాలు 

పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని కోర్టు సూచన

వ్యక్తిగత, రహస్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయరాదని ప్రజలను నోటీసులో హెచ్చరించింది. సమాచారం ఇచ్చినట్లయితే, అది సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అయ్యే అవకాశముందని కోర్టు పేర్కొంది. ప్రజలు ఆ నకిలీ వెబ్‌లింకులను క్లిక్ చేయరాదని లేదా వాటిని ఓపెన్ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది. సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ www.sci.gov.in మాత్రమేనని, ఎప్పుడైనా అనుమానాస్పద యూఆర్ఎల్ వస్తే దానిని సరిచూసి ఓపెన్ చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వ్యక్తిగత సమాచారాన్ని అడగదని ప్రజలు గుర్తుంచుకోవాలని ఈ నోటీసులో పేర్కొన్నది. ఎవరైనా ఫిషింగ్ దాడులకు గురైతే, వెంటనే తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని కోర్టు సూచించింది. ఈ దాడుల గురించి పోలీసులు తెలుసుకున్నారని, సంబంధిత కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది.