 
                                                                                Mushroom: ల్యాప్‌టాప్‌కు విద్యుత్ ఇచ్చే పుట్టగొడుగు.. శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా వంటగదిలో కనిపించే శిటాకే పుట్టగొడుగు ఇప్పుడు శాస్త్రవేత్తల పరిశోధనలతో కంప్యూటర్ చిప్‌లకు విద్యుత్ సరఫరా చేసే కొత్త మార్గంగా మారింది. ఇప్పటి వరకు అరుదైన లోహాలతో తయారు చేసే చిప్‌లకు ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. మానవ మేధస్సు సమాచారాన్ని ఎలా పంపించుకుంటుందో అలా పని చేసే "న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్" రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేశారు. ఈ విధానం లోహాలు,ఖరీదైన సెమీకండక్టర్ పదార్థాల బదులు పుట్టగొడుగులను ఉపయోగించి తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి హానికరం కాని చిప్‌లను రూపొందించే అవకాశం ఉందని తెలిపారు.
మెమ్రిస్టర్లు
పుట్టగొడుగు తంతువుల ఎలక్ట్రోడ్లతో "ఫంగల్ మెమ్రిస్టర్లు"
న్యూరోమార్ఫిక్ సిస్టమ్స్‌లో "మెమ్రిస్టర్లు" అనే భాగాలు కీలకంగా పనిచేస్తాయి. ఇవి మన మెదడు సైనాప్సెస్‌ల మాదిరిగా సమాచారాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేస్తాయి. అయితే సాధారణంగా వీటిని తయారు చేయడానికి ఖరీదైన పదార్థాలు, క్లిష్టమైన సాంకేతికత అవసరం అవుతుంది. అదే సమయంలో, ప్రయోగశాలలో పెంచిన కృత్రిమ మెదడు కణజాలం (neural organoids) పద్ధతి కూడా ప్రయత్నించారు. కానీ అది చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు పుట్టగొడుగు తంతువుల (fungal network)తో ఎలక్ట్రోడ్లను కలిపి "ఫంగల్ మెమ్రిస్టర్లు"ని రూపొందించారు. ఆశ్చర్యకరంగా,ఇవి 5.85 కిలోహెర్ట్జ్ వరకు 90 శాతం ఖచ్చితత్వంతో పనిచేశాయని తెలిపారు. అంటే ప్రారంభ దశ సిలికాన్ చిప్‌లకు సమానంగా పనితీరు చూపించాయి.
వివరాలు
సిలికాన్ చిప్‌ల యుగం ముగిసిందా?
ఈ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించే దిశగా ఇది గొప్ప ముందడుగు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. శిటాకే పుట్టగొడుగుతో తయారైన చిప్‌లు సహజంగా కుళ్లిపోయే (biodegradable),సేంద్రీయ పదార్థాలతో తయారవుతాయి. అందువల్ల, "సిలికాన్ చిప్‌ల యుగం ముగిసిందా?" అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పటి పర్యావరణ కాలంలో "గ్రీన్ టెక్నాలజీ" అవసరం పెరుగుతున్నందున, జీవించే కంప్యూటర్ అనే ఆలోచన కూడా ఇక అసాధ్యంగా అనిపించడం లేదు. శిటాకే పుట్టగొడుగు ఇక కేవలం ఆహారం కాదు. భవిష్యత్తులో మీ ల్యాప్‌టాప్‌ను, కారు ఇంజిన్‌ను లేదా ఏఐ సిస్టమ్‌లను నడిపించే "జీవ సాంకేతిక శక్తి" కావొచ్చు!