Loading...
Voyager 1: స్పెస్‌లో మరో చరిత్ర... 1970 నాటి టెక్నాలజీతోనే పనిచేస్తున్న వాయేజర్‌ 1
స్పెస్‌లో మరో చరిత్ర... 1970 నాటి టెక్నాలజీతోనే పనిచేస్తున్న వాయేజర్‌ 1

Voyager 1: స్పెస్‌లో మరో చరిత్ర... 1970 నాటి టెక్నాలజీతోనే పనిచేస్తున్న వాయేజర్‌ 1

వ్రాసిన వారు Balachander Sharma
Nov 22, 2026
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు 49 ఏళ్ల క్రితం భూమి నుంచి బయలుదేరిన నాసా వాయేజర్‌ 1 ఇప్పుడు మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. భూమికి ఏకంగా 16.1 బిలియన్‌ మైళ్లు (25.9 బిలియన్‌ కిలోమీటర్లు) దూరంలోకి వెళ్లింది. అంటే అక్కడి నుంచి బయలుదేరిన రేడియో సిగ్నల్‌ భూమిని చేరేందుకు సుమారు 24 గంటలు పడుతుంది. నవంబర్‌ 18న ఈ ఘట్టం నమోదైంది. 1977లో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక ఇంత దూరం వెళ్లినా భూమితో సంబంధాలు కొనసాగించడం శాస్త్రవేత్తలను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తోంది.

Details

మైక్రోసాఫ్ట్‌ ఏఐ సీఈఓ ప్రశంసలు

వాయేజర్‌ 1 సాధించిన ఈ ఘనతపై మైక్రోసాఫ్ట్‌ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్‌ కూడా స్పందించారు.

1970 కాలం నాటి టెక్నాలజీతో తయారైన ఈ వ్యోమనౌక దాదాపు ఐదు దశాబ్దాలుగా అంతరిక్షంలో ప్రయాణిస్తూ ఇంకా తన ఉనికిని తెలియజేస్తోందని ఆయన ప్రశంసించారు.

నిజానికి అప్పటి కంప్యూటర్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలతో పోలిస్తే నేటి టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది.

అయినా వాయేజర్‌ 1 మాత్రం తన ప్రయాణాన్ని ఆపకుండా ముందుకు సాగుతోంది. ఇదే ఈ మిషన్‌ ప్రత్యేకతను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.

Details

జూపిటర్‌ నుంచి ఇంటర్‌స్టెల్లార్‌ స్పేస్‌ వరకు

1977 సెప్టెంబర్‌ 5న ప్రయోగించిన వాయేజర్‌ 1 తొలుత సౌర కుటుంబంలోని గ్రహాలను అధ్యయనం చేయడానికి బయలుదేరింది.

గురుగ్రహం, శనిగ్రహం వద్ద ఎన్నో కీలక సమాచారాన్ని సేకరించింది. గురుగ్రహం చుట్టూ పలుచని వలయాన్ని గుర్తించడంతో పాటు థీబీ, మెటిస్‌ అనే రెండు ఉపగ్రహాలను కూడా గుర్తించింది.

2012లో సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉండే హీలియోస్ఫియర్‌ సరిహద్దును దాటి ఇంటర్‌స్టెల్లార్‌ స్పేస్‌లోకి ప్రవేశించిన తొలి మానవ నిర్మిత వ్యోమనౌకగా చరిత్ర సృష్టించింది.

ADVERTISEMENT

Details

వయసు పెరిగినా తగ్గని ప్రయాణం

వాయేజర్‌ 1 ప్రస్తుతం గంటకు దాదాపు 38,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇంతకాలం పనిచేయడానికి ఇంజినీర్లు ఎన్నో కొత్త మార్గాలను అనుసరించారు.

పాత పరికరాల్లో సమస్యలు రావడంతో తక్కువ విద్యుత్‌ వినియోగించే ప్రత్యామ్నాయ వ్యవస్థలను ఉపయోగించారు.

వ్యోమనౌకలోని రేడియో ఐసోటోప్‌ థర్మల్‌ జనరేటర్‌ ప్లూటోనియం నుంచి వెలువడే వేడిని విద్యుత్‌గా మారుస్తుంది. అయితే ఆ శక్తి క్రమంగా తగ్గుతోంది.

అయినప్పటికీ వాయేజర్‌ 1 తన 50వ ప్రయోగ వార్షికోత్సవం వరకు శాస్త్రీయ పరికరాలను కొనసాగించేలా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

ADVERTISEMENT

Details

ఇక ముందు ఏం జరుగుతుంది?

వాయేజర్‌ 1 నుంచి నవంబర్‌ 14 తర్వాత శాస్త్రీయ, ఇంజినీరింగ్‌ డేటా అందకపోయినా క్యారియర్‌ సిగ్నల్‌ మాత్రం వస్తోంది. దాని ఆధారంగానే తాజా మైలురాయిని నిర్ధారించారు.

భూమి నుంచి పంపే ఆదేశాలు, అక్కడి నుంచి వచ్చే సంకేతాల మధ్య ఇప్పుడు 24 గంటల సమయం పడుతోంది.

ఒకరోజు ఆ సిగ్నల్‌ కూడా ఆగిపోవచ్చు. కానీ అప్పటివరకు వాయేజర్‌ 1 మానవాళి తరఫున నక్షత్రాల వైపు సాగుతున్న అత్యంత దూరపు దూతగానే కొనసాగుతుంది.

ADVERTISEMENT