Dinga Dinga: డింగా డింగా అంటే ఏమిటి?.. ఉగాండాలో వ్యాప్తి చెందుతున్న మిస్టీరియస్ వ్యాధి లక్షణాలు ఇవే..!
ఆఫ్రికాలోని ఉగాండాలో ఒక కొత్త రకం "మిస్టరీ వ్యాధి" ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో భయాన్ని రేకెత్తిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే దేశంలో సుమారు 300 మందికి పైగా ప్రభావితమయ్యారు. ఉగాండాలోని బుండిబుగ్యో జిల్లా స్థానికులు ఈ వ్యాధికి "డింగా డింగా" అని పేరు పెట్టారు. ముఖ్యంగా ఇది మహిళలు, బాలికలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది.
వ్యాధి బాధితులకు యాంటీబయోటిక్స్‌తో చికిత్స
"డింగా డింగా" వ్యాధి లక్షణాలలో జ్వరం, శరీరంలో వణుకు ముఖ్యమైనవి. ఈ లక్షణాల వల్ల బాధితులు నడవడం కూడా చాలా కష్టంగా మారుతోంది. వైద్య నిపుణుల ప్రకారం, ఈ వ్యాధి కారణంగా శారీరక పరిస్థితి మరింత దెబ్బతింటోంది. ప్రస్తుతం ఈ వ్యాధి బాధితులకు యాంటీబయోటిక్స్‌తో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు "డింగా డింగా" కారణంగా మరణాలు చోటుచేసుకోలేదని బుండిబుగ్యో జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డా. కియితా క్రిస్టోఫర్ తెలిపారు.
కొత్త కేసులు నమోదు కాలేదు: వైద్యులు
వైద్య నిపుణులు ప్రత్యేక చికిత్సలను అందజేస్తున్నారని, బాధితులు సాధారణంగా ఒక వారంలో కోలుకుంటున్నారని ఆయన వెల్లడించారు. స్థానిక ప్రజలు సమీప ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు. బుండిబుగ్యో జిల్లాలోని సమీప ప్రాంతాల్లో ఇంకా కొత్త కేసులు నమోదు కాలేదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యాధి గురించి మరింత సమాచారం కోసం నమూనాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపించామని, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు.