Disease X: కాంగోను వణికిస్తున్నమిస్టీరియస్ ఫ్లూ.. డబ్ల్యూహెచ్‌వో ఊహించిన ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా?
అంతుచిక్కని వ్యాధి కాంగో దేశాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో, దానికి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు ఏవిధమైన అంచనాలవల్లనూ స్పష్టంగా తెలియలేదు. ఈ వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 31 మంది చనిపోవడం ఆందోళన కలిగించే విషయం. మృతులలో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. ఫ్లూ తరహాలో వ్యాపిస్తూ,శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మరణాలు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిపై దృష్టి పెట్టింది. నవంబర్ 29న కాంగో ఆరోగ్య శాఖ డబ్ల్యూహెచ్‌వోకు నివేదిక అందించింది. దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైంది,ఇందులో ఆఫ్రికా సీడీసీ కూడా భాగస్వామి అయ్యింది. అయితే,ఇప్పటి వరకు వ్యాధి వ్యాప్తికి గల కారణాలను సరిగా నిర్ధారించలేకపోయారు.దీనికితోడు,ఈ వ్యాధిని డిసీజ్ ఎక్స్(Disease X)గా పరిగణిస్తున్నారు.
"డిసీజ్ ఎక్స్" అంటే ఏమిటి?
కోవిడ్-19 తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కొత్త మహమ్మారి విజృంభించగలదని అంచనా వేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతూ, మనుషులకు ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ ప్రాధమిక ఆందోళనలో, "డిసీజ్ ఎక్స్"ను అనేక వైరస్‌ల జాబితాలో చేర్చింది. అయితే, ఈ వ్యాధి స్పష్టమైన కారణం ఏది అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ, కోవిడ్-19 తరహాలో శ్వాసకోశ సమస్యలు కలిగించే వైరస్‌గా ఉండే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్‌ల తయారీపై కూడా శ్రద్ధ పెరిగింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇప్పటికే కోవిడ్-19 వ్యాక్సిన్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది, అలాగే భవిష్యత్తులో ఎటువంటి మహమ్మారులు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు మరిన్ని వ్యాక్సిన్ల తయారీపై చర్యలు తీసుకుంటున్నారు.
వ్యాప్తి రేటుపై ఇంకా పరిశోధనలు
కాంగోలో ఈ వ్యాధి విజృంభణ మారుమూల కువాంగో ప్రాంతంలో మొదలైంది. ఇప్పటి వరకు 406కేసులు నమోదయ్యాయి, అందులో 31మంది చనిపోగా,పిల్లలు ఎక్కువగా మృతి చెందారు. ఈ వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుందనే విషయం ఇంకా క్లారిటీ లేకపోవడం అవగాహనకు సమస్యగా మారింది. కాంగోలో రికార్డు చేయబడిన వ్యాధి లక్షణాలు జ్వరం,తలనొప్పి,దగ్గు, జలుబు,ఒళ్లు నొప్పులు ఉంటాయి. డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం ఈ కేసులను పరిశీలించగా,పౌష్టికాహార లోపం,శ్వాసకోశ ఇబ్బందులు,రక్తహీనత వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే, ఆహార కొరత,తక్కువ వ్యాక్సినేషన్, వైద్య సేవలకు లోటు, సరైన వసతుల లోపం కూడా వ్యాధి వ్యాప్తికి కారణంగా కనిపిస్తున్నాయి. అయితే,ఈ వ్యాధి డిసీజ్ ఎక్స్‌నేనా,దాని తీవ్రత ఏంటి, వ్యాప్తి రేటు ఏమిటి అన్న దానిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.