Whatsapp: పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు.. ఒక్క నెలలో 80 లక్షల వాట్సప్ ఖాతాలపై నిషేధం!
మెటాకు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను (WhatsApp) మన దేశంలో కోట్లాది మంది వినియోగిస్తున్నారు. అయితే, ఈ ఉపయోగా సైబర్ నేరగాళ్లు దీనిని అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపధ్యంలో, భారీ సంఖ్యలో ఖాతాలపై వాట్సప్ నిషేధం విధించింది. ఒక్క ఆగస్టులోనే సుమారు 80 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు గానూ ఈ చర్యలు చేపట్టినట్లు వాట్సప్ తెలిపింది.
గ్రీవెన్స్ మెకానిజం ద్వారా యూజర్ల నుంచి 10,707 ఫిర్యాదులు
ఐటీ యాక్ట్ 2021 నిబంధలను అనుసరించి, ఆగస్టు నెలలో భారీ సంఖ్యలో ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సప్ వెల్లడించింది. మొత్తం 84.58 లక్షల ఖాతాలపై చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ఇందులో సుమారు 16.61 లక్షల ఖాతాలను ముందు జాగ్రత్త చర్యగా బ్యాన్ చేశామని తెలిపింది. మోసానికి ఆస్కారం ఉండే బల్క్ మెసేజ్‌లు లేదా అసాధారణ మెసేజ్‌లను వాట్సప్ తన ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ముందుగానే గుర్తించి ఈ చర్యలు చేపట్టింది. అలాగే, ఆగస్టు నెలలో గ్రీవెన్స్ మెకానిజం ద్వారా యూజర్ల నుంచి 10,707 ఫిర్యాదులు అందినట్లు వాట్సప్ వెల్లడించింది.
ఖాతాల నిషేధం ఎందుకు?
వాట్సప్ టర్మ్స్ అండ్ కండీషన్లను ఉల్లంఘించినందుకు గానూ వాట్సప్ ఈ తరహా చర్యలు తీసుకుంటుంది. మోసం లేదా తప్పుడు సమాచారం చేరవేతకు బల్క్, స్పామ్ మెసేజులు పంపించడం నిబంధనలకు విరుద్ధం. స్థానిక చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా వాట్సప్ చర్యలు తీసుకుంటుంది. అనుచిత ప్రవర్తన, వేధింపులు వంటి విషయాల్లో యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత ఖాతాలను వాట్సప్ బ్యాన్ చేస్తుంటుంది.