Page Loader
WhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ 
సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌

WhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2025
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెంటనే మెసేజ్ పంపాలన్నా లేదా ఫోటోలను పంచుకోవాలన్నా,మనకు గుర్తొచ్చే ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ (WhatsApp). ఈ యాప్‌ వినియోగదారుల కోసం తరచుగా కొత్త ఫీచర్లు, అప్‌డేట్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా గ్రూప్‌ కాల్స్‌ కోసం అందించిన వాయిస్‌ చాట్స్‌ (Voice Chats) అనే ఫీచర్‌ను మరింత విస్తరించింది. ఇప్పటివరకు ఈ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ 33 మందికిపైగా సభ్యులున్న గ్రూపులకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూపులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వాట్సప్‌ ప్రకటించింది. అంటే ఏ గ్రూప్‌లోనైనా సభ్యులు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

వివరాలు 

సాధారణ గ్రూప్‌ కాల్స్‌ కంటే కాస్త భిన్నంగా..

ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేయాలంటే, గ్రూప్‌ చాట్‌ను ఓపెన్‌ చేసి, క్రిందివైపు స్వైప్‌ చేయాలి. అప్పుడు "Swipe up to chat" అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.దాన్ని కొన్ని సెకన్ల పాటు నొక్కి ఉంచితే వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ చాలా మంది ఆండ్రాయిడ్‌,ఐఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. మిగతా యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది.ఈ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ సాధారణ గ్రూప్‌ కాల్స్‌ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణంగా గ్రూప్‌ కాల్‌ వచ్చినప్పుడు,అందరికీ రింగ్‌టోన్‌తో పాటు నోటిఫికేషన్‌ వస్తుంది. కానీ వాయిస్‌ చాట్‌ ద్వారా గ్రూప్‌ కాల్‌ మొదలైతే, సభ్యులకి ఎలాంటి శబ్దం వచ్చే నోటిఫికేషన్‌ రాదు. దానికి బదులుగా కేవలం సైలెంట్‌ నోటిఫికేషన్‌ మాత్రమే కనిపిస్తుంది.

వివరాలు 

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సదుపాయంతోనే రూపొందించారు 

ఇందులో పాల్గొనాలనుకునే వారు, కాల్‌ ముగిసేలోపు ఎప్పుడైనా జాయిన్‌ కావచ్చు. అంతేకాదు, వాయిస్‌ చాట్‌లో ఉన్న వారు ఇతరుల ప్రొఫైల్‌ డెటైల్స్‌ను కూడా చూడగలుగుతారు. ముఖ్యంగా, ఈ వాయిస్‌ చాట్స్‌ కూడా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సదుపాయంతోనే రూపొందించబడ్డాయి. ఇది వినియోగదారుల గోప్యతను మరింత భద్రతగా కాపాడుతుంది.