APK Files: ఏపీకే ఫైల్‌ల పేరుతో తెలంగాణలో సైబర్ దాడి కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు. ' మీ ఆధార్, ఇతర కేవైసీ వివరాలు అప్‌డేట్ కాకపోవడంతో ఈరోజు రాత్రి నుంచి మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుంది. వెంటనే క్రింద ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేసి వివరాలు అప్‌లోడ్ చేయండి' అంటూ టీం ఎస్బీఐ పేరిట ఆదివారం అనేక వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు వరుసగా చేరాయి. ఎస్బీఐ ఖాతాదారులలో చాలామంది ఖాతా బ్లాక్ అవుతుందేమోనని భయంతో ఆ లింక్‌పై క్లిక్ చేశారు. అదే క్షణం నుంచి వారి మొబైల్‌లు పూర్తిగా మోసగాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. తరువాత ఆ ఫోన్లలోని ఇతర వాట్సాప్ గ్రూపులకు కూడా ఇదే మెసేజ్‌ను ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ చేశారు.
వివరాలు
1930 హెల్ప్‌లైన్ కు కూడా ఫిర్యాదులు
ఇలా గొలుసు రీతిలో ఈ సందేశం వేలాది ఫోన్లకు వెళ్లిపోయింది. ఈ గ్రూపుల్లో రాష్ట్ర మంత్రిత్వశాఖల అధికారి గ్రూపులు, మీడియా వర్గాల గ్రూపులు, స్నేహితుల గ్రూపులు, విద్యార్థుల గ్రూపులు కూడా ఉండటం మరింత ఆందోళన సృష్టించింది. ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. అనేక మంది స్థానిక పోలీసులను సంప్రదించడంతోపాటు 1930 హెల్ప్‌లైన్ కు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు.
వివరాలు
తక్షణం చేయాల్సిన చర్యలు
పొరపాటున ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ చేసినట్లయితే వెంటనే ఈ చర్యలు తీసుకోవాలి: ముందుగా ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేయాలి. మొబైల్ సెట్టింగ్స్ → యాప్స్ లోకి వెళ్లి ఆ ఏపీకే యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. మీ ఫోన్‌ని యాంటీ వైరస్‌తో పూర్తి స్కాన్ చేయాలి. బ్యాంకింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్ ఖాతాలకు సంబంధించిన అన్ని పాస్‌వర్డులను వెంటనే మార్చాలి. మీ మొబైల్‌లోని మెసేజ్‌లు, కాల్ లాగ్, బ్యాంక్ లావాదేవీలు, ఈ-మెయిల్ లాగిన్లలో ఏమైనా అనుమానాస్పదమైనదేమైనా ఉందో చెక్ చేయాలి. మాల్‌వేర్ యాప్ అన్‌ఇన్‌స్టాల్ అవకపోతే ఫోన్‌ను సేఫ్ మోడ్‌లో రీస్టార్ట్ చేసి అక్కడి నుంచి అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.
వివరాలు
తక్షణం చేయాల్సిన చర్యలు
ఇంకా అనుమానాస్పద ప్రవర్తన కనిపిస్తే, మీ డేటాను బ్యాకప్ తీసుకుని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది. ఏదైనా మోసానికి గురైనట్లు అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్ ఖాతాను బ్లాక్/ఫ్రీజ్ చేయించాలి. వెంటనే 1930 కి ఫోన్ చేసి అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయాలి.