కన్నుల విందుగా జీరో షాడో డే ఆవిష్కరణ.. ఎండలో మాయమైన నీడ
హైదరాబాద్ మహానగరంలో ఇవాళ జీరో షాడో డే ఆవిష్కృతం అయ్యింది. మధ్యాహ్నం 12.22 నిమిషాలకు ఎండలో ఉన్న వస్తువులు, మనుషులపై కొన్ని నిమిషాల పాటు నీడ(SHADOW) మాయమైపోయింది. సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటమే దీనికి కారణమని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. జీరో షాడో డేని ఆసక్తిగా వీక్షేంచేందుకు బిర్లా ప్లానిటోరియం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తి మీదకి వచ్చే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో నిల్చోవాలి. ఆ సమయంలో కొద్దిసేపు నీడ కనిపించదు. దీన్నే జీరో షాడో అంటారని బిర్లా ప్లానిటోరియంలోని ఓ అధికారి వెల్లడించారు. భూ మధ్య రేఖకు దగ్గరి ప్రాంతాల్లో మకర రేఖ, కర్కాటక రేఖ మధ్య ఏడాదికి 2 సార్లు జీరో షాడో డే ఆవిర్భవమవుతుంది.
తొలిసారి మే 9న హైదరాబాద్ నగరంలో షాడో డే
సూర్యుడు భూమధ్య రేఖలో నేరుగా ఎగువకు పయనిస్తాడు. దీంతో భూమిపై ఉన్న వస్తువులు, జీవుల నీడ ఉండదు. 2023లో తొలిసారి మే 9న హైదరాబాద్ నగరంలో షాడో డే ఏర్పడింది. ఏడాదికి రెండు సార్లు జీరో షాడో డే జరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ భ్రమించే క్రమంలో సూర్య కిరణాలు భూమిని తాకే కోణం మారుతుంటుంది. దీంతో భానుడి కిరణాల దిశ సైతం మారుతుంది. భూమిది గోళాకారం కాబట్టి మధ్యాహ్నం భూ మధ్యరేఖపై మాత్రమే సూర్యుడి కిరణాలు పడతాయి. భూమి వంపు 23.5 డిగ్రీలు ఉండటం వల్ల భూ మధ్య రేఖకు అన్ని డిగ్రీల్లో కిరణాలు నేరుగా పడతాయి.ఉత్తరాన, దక్షిణాన ఒకసారి చొప్పున జరగడంతో 2 సార్లు జీరో షాడో డే ఏర్పడుతుంది.