Page Loader
Bangladesh: 5 పరుగులకే 7 వికెట్లు: కుప్పకూలిన బంగ్లాదేశ్..శ్రీలంక ప్రపంచ రికార్డ్

Bangladesh: 5 పరుగులకే 7 వికెట్లు: కుప్పకూలిన బంగ్లాదేశ్..శ్రీలంక ప్రపంచ రికార్డ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఏ జట్టు గెలుస్తుందో ముందే చెప్పడం కష్టం. చాలా సార్లు గెలుపు ఖాయమనిపించిన మ్యాచ్‌లు అనూహ్యంగా చేజారిపోతుంటాయి. అలాంటి ఒక ఉదంతం తాజాగా శ్రీలంక,బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన తొలి వన్డేలో కనిపించింది. తొలి విజయం తమ ఖాతాలో పడుతుంది అని నమ్మిన బంగ్లాదేశ్,ఒక్కసారిగా తడబడి భారీ పరాజయాన్ని చవిచూసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ వన్డేలో శ్రీలంక 245 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది. ఈ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ ఓ దశలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 100 పరుగులు సాధించింది. ఈస్థితిలో ఆ జట్టు విజయం సులభమేననిపించింది. కానీ ఊహించని విధంగా జరిగిన పరిణామాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి.

వివరాలు 

100/1గా ఉన్నబంగ్లాదేశ్,కాసేపటికే 105/7 గా కుప్పకూలింది

మొత్తం 27 బంతుల వ్యవధిలో బంగ్లా బ్యాటర్లు కేవలం 5 పరుగులు చేసి ఏకంగా 7 వికెట్లు కోల్పోయారు. ఒకానొక సమయంలో 100/1గా ఉన్నబంగ్లాదేశ్,కాసేపటికే 105/7 గా కుప్పకూలింది. ఈ అనూహ్య పతనంతో ఓటమి అంచున నిలిచిన బంగ్లాదేశ్, ఆ తర్వాత కోలుకోలేకపోయింది. చివరికి బంగ్లాదేశ్ మొత్తం 167 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంక 77 పరుగుల తేడాతో గెలిచి వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో శ్రీలంక ఖాతాలో పలు రికార్డులు వచ్చి చేరాయి.

వివరాలు 

శ్రీలంక తర్వాత స్థానంలో వెస్టిండీస్

వన్డేల్లో కేవలం ఐదు పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఈ సందర్భంగా ఆ జట్టు గత ఏడాది ఆఫ్ఘనిస్థాన్‌పై నెలకొల్పిన తన సొంత రికార్డును బద్దలుకొట్టింది. అలాగే, ఏడు లేదా అంతకంటే తక్కువ పరుగులు ఇవ్వడం ద్వారా 7 వికెట్లు పడగొట్టడం ఇది శ్రీలంకకు మూడోసారి. ఈ రికార్డు సాధించిన జట్లలో శ్రీలంక తర్వాత స్థానంలో వెస్టిండీస్ మాత్రమే ఉంది.