Page Loader
Mumbai Indians: ముంబై జట్టులోకి విధ్వంసకర ఆటగాడు?
ముంబై జట్టులోకి విధ్వంసకర ఆటగాడు?

Mumbai Indians: ముంబై జట్టులోకి విధ్వంసకర ఆటగాడు?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2025
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ ప్రారంభం అంతగా బలంగా లేకపోయినా, హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టు అద్భుతమైన రికవరీతో పాయింట్ల పట్టికలో టాప్-4 స్థానంలో నిలిచింది. అయితే భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ ఐపీఎల్ 2025 సీజన్‌ను వాయిదా వేసింది. ఇప్పుడు ఐపీఎల్ మే 17 నుంచి మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై జట్టులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ విల్ జాక్స్ వెస్టిండీస్ సిరీస్ కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనని తెలిసింది. దీంతో ఆ జట్టు మరో ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను జట్టులోకి తీసుకోవాలని యోచిస్తోంది.

Details

చరిత్ అసలంకాతో సంప్రదింపులు

ఈ సారి మెగా వేలంలో బెయిర్‌స్టో అమ్ముడుపోలేదు, కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నుండి అనుమతి పొందితే ప్లేఆఫ్స్ సమయంలో ఆయన జట్టులో చేరే అవకాశం ఉంది. అలాగే, ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కారణంగా ప్లేఆఫ్స్‌కు అందుబాటులో లేకపోవచ్చు. ఈ నేపథ్యంలో, జట్టు శ్రీలంక బ్యాట్స్‌మన్ చరిత్ అసలంకాతో సంప్రదింపులు జరుపుతూ ఉంది. జానీ బెయిర్‌స్టో ఇప్పటికే పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ ఆడిన అనుభవం కలిగి ఉన్నాడు.

Details

పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ముంబై

ముంబై యాజమాన్యం బెయిర్‌స్టోను రోహిత్ శర్మతో ఓపెనింగ్ జంటగా ఆలోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి 5 సార్లు పరాజయపాలయ్యాయి. 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. జట్టుకు ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌తో రెండు కీలక మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఈ మ్యాచ్‌లలో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలని ముంబై ఆశపడుతోంది.