న్యూజిలాండ్‌కు భారీ షాక్.. వన్డే వరల్డ్ కప్‌కు బ్రేస్‌వెల్ దూరం
వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కెప్టెన్ విలియమ్సన్ జట్టుకు దూరం కాగా.. తాజాగా ఆల్‌రౌండర్ మైకెల్ బ్రెస్‌వేల్ ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఇంగ్లిష్ టీ20 బ్లాస్ట్‌లో వార్సెస్టర్‌షైర్ తరుపున బ్రెస్‌వేల్ ఆడుతున్నాడు. యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ చేస్తుండగా కాలికి గాయమైంది. కేవలం 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా అతను మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత కుడి కాలి మడమ దగ్గర తీవ్ర గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఇంగ్లాండ్‌లో బ్రేస్‌వెల్ కాలికి శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. అతను కోలుకోవడానికి 6 నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ ఆల్‌రౌండర్ సేవలను కివీస్ జట్టు కోల్పోనుంది.
బ్రేస్‌వెల్, విలియమ్సన్ సేవలను కోల్పోనున్న న్యూజిలాండ్
చివరిగా న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు బ్రేస్‌వెల్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచులో సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున కూడా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఇటీవల ఐపీఎల్ మ్యాచులో ఫీల్డింగ్ చేస్తుండగా విలియమ్సన్ గాయపడటంతో అతని కుడిమోకాలి లిగ్నెంట్ కు శస్త్ర చికిత్స చేశారు. విలియమ్సన్ కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 5న భారత్ వేదికగా ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.