Loading...
Mohammed Shami: పొలిటికల్‌ ఎంట్రీపై షమీ కీలక అడుగు..? పార్టీ అధినేతతో మీటింగ్‌!
పొలిటికల్‌ ఎంట్రీపై షమీ కీలక అడుగు..? పార్టీ అధినేతతో మీటింగ్‌!

Mohammed Shami: పొలిటికల్‌ ఎంట్రీపై షమీ కీలక అడుగు..? పార్టీ అధినేతతో మీటింగ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2026
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్ షమీని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకుంటారా? లేదా? అనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో షమీ రాజకీయాల్లోకి రానున్నారంటూ నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD) పార్టీ అధినేత జయంత్‌ చౌధరీతో షమీ భేటీ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD) అధినేత జయంత్‌ చౌధరీతో మహమ్మద్‌ షమీ ఆదివారం దిల్లీలో సమావేశమయ్యాడు. వీరి భేటీకి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఈ సమావేశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ.. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో షమీ పోటీ చేసే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వివరాలు

ఆర్‌ఎల్‌డీ టికెట్‌పై షమీ పోటీ చేయనున్నట్లు ప్రచారం

అమ్రోహా శాసనసభ నియోజకవర్గం నుంచి ఆర్‌ఎల్‌డీ టికెట్‌పై షమీ పోటీ చేయనున్నట్లు ప్రచారం మొదలైంది.

షమీ అమ్రోహా జిల్లాలోనే జన్మించాడు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి అతడిని బరిలోకి దింపే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలో ఆర్‌ఎల్‌డీ పార్టీ మిత్రపక్షంగా కొనసాగుతోంది.

మరోవైపు అమ్రోహా శాసనసభ నియోజకవర్గానికి ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ నేత మహబూబ్‌ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌ అలీ తన సమీప భాజపా ప్రత్యర్థిపై 71 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తద్వారా వరుసగా నాలుగోసారి అమ్రోహా ఎమ్మెల్యేగా గెలిచారు.

వివరాలు

వ్యూహాలను రచిస్తోన్న ఎన్డీయే

ఇప్పుడు అమ్రోహా నియోజకవర్గం నుంచి షమీని పోటీకి దింపడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని ఎన్డీయే వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

అయితే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు షమీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా.. మహమ్మద్‌ షమీ రాజకీయాల్లోకి రానున్నారంటూ గతంలోనూ పలుమార్లు వార్తలు వచ్చాయి.

2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా షమీ బెంగాల్‌ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే ఆ సమయంలోనూ ఆయన రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో షమీ నిలకడగా ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. టీమ్‌ఇండియా సెలక్టర్లు మాత్రం అతడి వైపు దృష్టిసారించడం లేదు. 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత నుంచి షమీ జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.

ADVERTISEMENT