Paris Paralympics 2024: పతక విజేతలకు ఘన స్వాగతం.. 7 స్వర్ణాలు సాధించిన అథ్లెట్లు
భారత పారా అథ్లెట్లు మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అథ్లెట్లకు ఘనంగా స్వాగతం లభించింది. పారా అథ్లెట్లు బయటికి రాగానే వారికి మద్దతుగా నినాదాలు చేశారు. ఇంతటి ఘనస్వాగతం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, రాబోయే రోజుల్లో 75 మీటర్లు అందుకోవడమే తన లక్ష్యమని స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ పేర్కొన్నారు. తాను క్రీడల కారణంగా కొంతకాలంగా టీ తాగలేదని, ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి టీ తాగాలని ఉందని ఆయన చెప్పారు.
స్వర్ణం గెలిచిన అథ్లెట్లకు రూ.75 లక్షలు
రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో అద్భుతమైన ప్రతిభ చూపిన శీతల్ దేవి, రాకేశ్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం గెలిచారు. మొత్తం 84 మంది అథ్లెట్లు పాల్గొని 29 పతకాలు సాధించారు. ఇందులో 7 స్వర్ణాలు ఉన్నాయి. ఈ విజయంతో టోక్యోలో సాధించిన 19 పతకాల రికార్డును భారత అథ్లెట్లు బద్దలు కొట్టారు. పారిస్‌లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానాలను ప్రకటించింది. క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ వెల్లడించిన వివరాల ప్రకారం, స్వర్ణం గెలిచిన అథ్లెట్లకు రూ. 75 లక్షలు, రజతం సాధించిన వారికి రూ. 50 లక్షలు, కాంస్యం గెలిచిన వారికి రూ. 30 లక్షలు నజరానా ఇవ్వనున్నారు.