Loading...
Vaibhav Sooryavanshi: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీ సంచలనం!
15 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీ సంచలనం!

Vaibhav Sooryavanshi: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీ సంచలనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 232 రోజుల వయసులోనే ఈ ఘనత అందుకున్నాడు. శనివారం (నవంబర్ 14) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 తొలి మ్యాచ్‌లో బిహార్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీంతో ఈ అరుదైన రికార్డు అతడి ఖాతాలో చేరింది. తన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన వైభవ్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

వివరాలు

బిహార్ కెప్టెన్‌గా ఒక్క మ్యాచ్ మాత్రమే!

బిహార్ జట్టు రంజీ ట్రోఫీ తొలి దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వైభవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ టోర్నీలో అతడు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడనున్నాడు. అనంతరం ఎమర్జింగ్ ఆసియా కప్ 2026లో పాల్గొనే భారత జట్టుతో కలవనున్నాడు.

బిహార్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడంపై వైభవ్ సంతోషం వ్యక్తం చేశాడు. తన క్రికెట్ ప్రయాణం ప్రారంభమైన స్థాయి నుంచి ఇప్పుడు సొంత రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎదగడం గొప్ప విజయమని పేర్కొన్నాడు.

తనకు ఈ అవకాశం కల్పించినందుకు బోర్డుకు కృతజ్ఞతలు తెలిపాడు.

వివరాలు

గతంలోనూ జట్టును నడిపించిన అనుభవం

వైభవ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఇషాన్ గాయంతో మైదానాన్ని వీడిన సమయంలో జట్టును నడిపించాడు.

ఆ టోర్నీ ఫైనల్లో సౌత్ జోన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది.

ADVERTISEMENT

వివరాలు

అండర్-19 ప్రపంచకప్ నుంచి ఐపీఎల్ వరకు దూకుడు

గతేడాది కాలంగా వైభవ్ అద్భుత ప్రదర్శనలతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులతో చెలరేగి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టోర్నీ మొత్తం నిలకడగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నాడు.

ఆ తర్వాత ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించాడు. 237.30 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

ఈ ప్రదర్శనలతో భారత టీ20 జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. జూలైలో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు.

ADVERTISEMENT

వివరాలు

స్వదేశంలో ఇంకా అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు

వైభవ్ ఇప్పటివరకు జపాన్, ఇంగ్లండ్, జింబాబ్వేలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే స్వదేశంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు.

ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో మొత్తం 44 మ్యాచ్‌లు ఆడిన అతడు.. అందులో బిహార్ తరఫున ఏడు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

గత సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో మహారాష్ట్రపై 61 బంతుల్లో అజేయంగా 108 పరుగులు సాధించాడు.

వివరాలు

ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత్ తరఫున బరిలోకి

ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. అయితే భారత వన్డే జట్టులో వైభవ్‌కు చోటు దక్కలేదు. రాబోయే విజయ్ హజారే ట్రోఫీలో బిహార్ తరఫున ఆడే అవకాశం ఉంది.

అంతకంటే ముందు ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

15 ఏళ్ల వయసులోనే టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్.. భవిష్యత్తులో మరెన్ని ఘనతలు సాధిస్తాడో చూడాలి.

ADVERTISEMENT