RCB: ఈ సీజన్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడే.. ఏబీ డివిలియర్స్ క్లారిటీ!
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు, జట్లన్నీ తమ స్క్వాడ్‌లను మెగా వేలంతో తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. వచ్చే ఏడాది మార్చి నుండి మే మధ్యకాలం వరకు ఐపీఎల్ 2025 జరగనున్నది.అయితే, కొన్ని జట్లు కెప్టెన్సీ విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నాయి. అందులో ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)జట్టు ఒకటి. భారీ ఫ్యాన్‌బేస్‌ను కలిగి ఉన్న ఆర్సీబీకి గత సీజన్లో ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వం వహించారు. కానీ, అతడిని రిటైన్ చేసుకోకపోవడం, అలాగే మెగా వేలంలో ఆర్సీబీ అతన్ని తీసుకోకపోవడంతో, ఇప్పుడు జట్టు కెప్టెన్సీపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, ఆర్సీబీ అభిమానులు విరాట్ కోహ్లీని తిరిగి జట్టును నడిపించాలని కోరుతున్నారు. అయితే,విరాట్ కోహ్లీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
స్పిన్ విభాగంలో ఆర్సీబీకి కొంతనష్టమే
ఈ సందర్భంగా, ఆర్సీబీ మాజీ ఆటగాడు, విరాట్ కోహ్లీకి ఆప్తుడు ఏబీ డివిలియర్స్ ఆ జట్టు కెప్టెన్సీపై స్పందించారు. ''విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కెప్టెన్‌గా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. కానీ, ప్రస్తుతం ఆర్సీబీ స్క్వాడ్‌లో విరాట్ మాత్రమే కెప్టెన్‌గా అద్భుతంగా నడిపించగలిగే ఆటగాడు.ఐపీఎల్ మెగా వేలంలో ఆర్సీబీ ఒక మంచి జట్టును పక్కన పెట్టింది. భువనేశ్వర్ కుమార్,జోష్ హేజిల్‌వుడ్ వంటి ప్రముఖ బౌలర్లతో పాటు, లుంగి ఎంగిడి కూడా ఆడుతున్నాడు. అతడు స్లో బంతులతో ప్రత్యర్థిని అడ్డుకోవచ్చు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, స్పిన్ విభాగంలో ఆర్సీబీకి కొంతనష్టమే ఉంది. రవిచంద్రన్ అశ్విన్‌ను మిస్ అవుతున్నాం,ఆయన్ను సీఎస్కే తీసుకుంది. కానీ, అతడు ఎట్టకేలకు యెల్లో జెర్సీలో కనిపించడం ఆనందంగా ఉంటుంది.
ఐపీఎల్ కమిటీ ట్రాన్స్‌ఫర్ విండోను ప్రారంభించాలి
అయినప్పటికీ, ఆర్సీబీ స్క్వాడ్ సమతుల్యంగా కనిపిస్తోంది. ఒక మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ లేకపోవడాన్ని, వారు తగిన విధంగా ఎదుర్కొంటారని అనుకుంటున్నాను. చిన్నస్వామి స్టేడియంలో విజయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి'' అని ఏబీ డివిలియర్స్ అన్నారు. ''ఆర్సీబీకి సరైన స్పిన్నర్ లేని సమస్యను పరిష్కరించడానికి, ఐపీఎల్ కమిటీ ట్రాన్స్‌ఫర్ విండోను ప్రారంభించాలి.భవిష్యత్తులో ఈ మార్గం ద్వారా ఏదైనా బలోపేతం పొందవచ్చని అనుకుంటున్నాను. ఐపీఎల్ టోర్నీ మధ్యలో ఈ నిబంధనను అమలు చేస్తే,ఆర్సీబీకి అదనంగా ఒక స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను.అన్‌సోల్డ్ జాబితాలోని ప్లేయర్లను తీసుకోవడం కూడా ఒక మంచి పరిష్కారం అవుతుంది.ఈ అంశంపై ఐపీఎల్ కమిటీ ఆలోచన చేస్తుందని నేను నమ్ముతున్నాను''అని ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ చెప్పారు.