టీమిండియాపై అడమ్ జంపా వీర విజృంభణ
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో 2-1తో వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. మార్చి 2019 నుంచి అన్ని ఫార్మాట్లో వరుసగా 24 సిరీస్‌లలో టీమిండియా విజయం సాధించింది. స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోవడం 2019 తర్వాత భారత్‌కు ఇదే తొలిసారి. తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ రోహిత్ సేన అగ్రపీఠాన్ని కోల్పోయింది. మూడో వన్డేలో అడమ్ జంపా 45/4తో భారత్ బ్యాటర్ల నడ్డి విరిచాడు. జంపా కొంతకాలంగా వన్డేల్లో ఆస్ట్రేలియా తరుపున మెరుగ్గా అడుతున్నాడు. జంపా భారత్‌తో ఇప్పటివరకూ 19 వన్డేలను ఆడాడు. ఇందులో 31 వికెట్లను పడగొట్టాడు. భారత గడ్డపై జంపా 14 వన్డేల్లో 29.45 సగటుతో 24 వికెట్లు పడగొట్టాడు.
భారత్ ప్లేయర్స్‌పై జంపాకు మెరుగైన రికార్డు
చెన్నై వేదికగా 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 77/1 స్కోరు చేసింది. అనంతరం జంపా శుభ్‌మన్ గిల్ (37), కేఎల్ రాహుల్ (32), హార్దిక్ పాండ్యా (40), రవీంద్ర జడేజా (18)లను అవుట్ చేసి మ్యాచ్ విజయంతంలో కీలక పాత్ర పోషించాడు. భారత ప్లేయర్‌పై జంపా మెరుగైన రికార్డును సాధించాడు. ముఖ్యంగా 12 ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీని 5 సార్లు జంపా ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మలను నాలుగు సార్లు వన్డే ఫార్మాట్లో అడమ్ జంపా ఔట్ చేశాడు. జంపా ప్రస్తుతం 79 వన్డేల్లో 131 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్ (219) వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉన్నాడు.