LOADING...
AFG vs IND: నేడు భారత్-అఫ్గానిస్థాన్ ఏకైక టెస్ట్.. భారత జట్టులో కొన్ని మార్పులు
నేడు భారత్-అఫ్గానిస్థాన్ ఏకైక టెస్ట్.. భారత జట్టులో కొన్ని మార్పులు

AFG vs IND: నేడు భారత్-అఫ్గానిస్థాన్ ఏకైక టెస్ట్.. భారత జట్టులో కొన్ని మార్పులు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 06, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ నేడు (జూన్ 6) న్యూ చండీగఢ్‌లోని న్యూ పీసీఏ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో ఆ వేదిక తొలిసారి టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇటీవల వరకు ఐపీఎల్ 2026 పోటీలతో కళకళలాడిన ఈ స్టేడియం ఇప్పుడు సంప్రదాయ టెస్ట్ క్రికెట్‌కు వేదికగా మారనుంది. టీమిండియా కూడా చాలా నెలల విరామం తర్వాత మళ్లీ టెస్ట్ క్రికెట్‌లో అడుగుపెడుతోంది. గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ అనంతరం భారత జట్టు తొలిసారిగా తెల్ల దుస్తుల్లో బరిలోకి దిగుతోంది.

వివరాలు

విజయం సాధించడమే లక్ష్యం..

ఐపీఎల్ ఫైనల్ ముగిసిన ఆరు రోజుల వ్యవధిలోనే ఈ టెస్ట్ ప్రారంభం కావడంతో ఆటగాళ్లు వైట్‌బాల్ క్రికెట్ నుంచి రెడ్‌బాల్ ఫార్మాట్‌కు అలవాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత జట్టులోని 15 మంది సభ్యుల్లో ఎనిమిది మంది ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో పాల్గొనడం విశేషం. ఈ మ్యాచ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగం కాకపోయినా, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణంగా తీసుకోవడం లేదని భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. విజయం సాధించడమే లక్ష్యంగా జట్టు పూర్తి స్థాయి పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నాడు.

వివరాలు

ఆ జట్టుకు ఇది 13వ టెస్ట్..

ఇక అఫ్గానిస్థాన్‌కు ఇది టెస్ట్ హోదా పొందిన తర్వాత ఆడబోయే 13వ టెస్ట్ మ్యాచ్. 2018లో బెంగళూరులో భారత్‌తో జరిగిన తమ తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ తేడాతో రెండు రోజుల్లోనే ఓటమి చవిచూసిన అఫ్గాన్ జట్టు, ఈసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన స్పిన్నర్ రషీద్ ఖాన్ అందుబాటులో లేకపోయినా, కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ జట్టుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. కొత్త హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్‌కు కూడా ఇదే తొలి బాధ్యత కావడం గమనార్హం. భారత జట్టులో సాయి సుదర్శన్ మరోసారి మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు

తుది జట్టులో వీరికి చోటు..

ఎడమచేతి స్పిన్ ఆల్‌రౌండర్లైన హర్ష్ దూబే లేదా మానవ్ సుతార్‌లలో ఒకరు ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశముంది. మరోవైపు నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. అఫ్గానిస్థాన్ జట్టు విషయానికి వస్తే, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రహ్మానుల్లా, ఎడమచేతి స్పిన్ ఆల్‌రౌండర్ నంగేయాలియా ఖరోటేలు టెస్ట్ క్రికెట్‌లో తొలి అడుగు పెట్టే అవకాశం ఉంది. పిచ్ స్వభావాన్ని పరిశీలిస్తే, నల్ల మట్టితో రూపొందించిన ఈ వికెట్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జూన్ నెలలో ఉత్తర భారతదేశంలో నమోదయ్యే తీవ్ర ఉష్ణోగ్రతలు ఆటగాళ్లకు సవాల్‌గా మారవచ్చు.

Advertisement