Cricket: క్రికెట్‌లో అద్భుతం.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్
క్రికెట్‌లో ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేం. ఒక్కోసారి ఓడిపోతుంది అనుకున్న జట్లు అనుహ్యంగా గెలిచి అందరిని ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా క్రికెట్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఓటమి అంచున ఉన్న జట్టును ఓ బౌలర్ ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు పడగొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆస్ట్రేలియాలోని జిల్లా క్రికెట్ క్లబ్‌లో ఈ ఘటన జరిగింది. ఇక ఆరు బంతుల్లో ఐదు పరుగులు చేస్తే ఆ జట్టు గెలుస్తుంది . సరిగ్గా అదే సమయంలో ముద్గీరాబా నెరంగ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ చివరి ఓవర్ లో ఒక్క పరుగు ఇవ్వకుండా ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి సంచలన రికార్డును సృష్టించాడు.
ఆరు వికెట్లు తీయడం ఆనందంగా ఉంది: గారెత్ మోర్గాన్
సర్ఫెర్స్ పారాడైజ్ జట్టు 40 ఓవర్లలో 178 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగింది. అయితే 39 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులను మాత్రమే చేసింది. గారెత్ మోర్గాన్ తీసిన ఆరు వికెట్లలో తొలి నాలుగు క్యాచులు కాగా, ఇద్దరు బౌల్డయ్యారు. చివరి ఓవర్ యువ బౌలర్ కు ఇవ్వాలని భావించానని, అయితే ఆ ఓటమి తన చేయి మీదుగా జరిగిపోతే బాగుటుందని అనుకున్నానని మోర్గాన్ పేర్కొన్నాడు. అయితే ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీయడం ఆనందంగా ఉందని చెప్పాడు.