LOADING...
HCA: హెచ్‌సీఏ ఆపరేషన్స్‌ హెడ్‌గా రాయుడు నియామకం
హెచ్‌సీఏ ఆపరేషన్స్‌ హెడ్‌గా రాయుడు నియామకం

HCA: హెచ్‌సీఏ ఆపరేషన్స్‌ హెడ్‌గా రాయుడు నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో పాలనను మెరుగుపరచడం, పారదర్శకతను పెంచడం లక్ష్యంగా అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జస్టిస్ నవీన్ రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ పర్యవేక్షణలో క్రికెట్ అభివృద్ధి, ఆట స్థాయి పెంపు కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడును హెచ్‌సీఏ క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌గా నియమించారు. హైదరాబాద్ క్రికెట్‌కు పాత వైభవాన్ని తీసుకురావడం లక్ష్యంగా ఆయనకు ముఖ్య బాధ్యతలు అప్పగించారు. మూడు సంవత్సరాల ఒప్పందంతో బాధ్యతలు స్వీకరించిన రాయుడు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు తీసుకోకుండా సేవలు అందించనున్నారు.

వివరాలు 

క్రికెట్‌ను పరిపాలన నుంచి వేరుగా ఉంచాలి : రాయుడు 

మంగళవారం బాధ్యతలు చేపట్టిన ఆయన శిక్షణ, జట్టు ఎంపిక, ప్రతిభ గుర్తింపు వంటి అన్ని అంశాలను పర్యవేక్షిస్తారని సంఘం అధ్యక్షుడు అమర్‌నాథ్, కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు. క్రికెట్‌ను పరిపాలన నుంచి వేరుగా ఉంచాలనే తన అభిప్రాయాన్ని రాయుడు స్పష్టం చేశారు. ఆటగాళ్ల సంక్షేమం, హైదరాబాద్‌కు రావలసిన గుర్తింపును సాధించడం తన ముఖ్య లక్ష్యమన్నారు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతి లేని క్రికెట్‌ను నెలకొల్పడమే తన లక్ష్యమని, ఎలాంటి అవినీతినీ సహించబోనని రాయుడు హెచ్చరించారు. ఇందుకోసం అవినీతి నిరోధక విభాగం, ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

వివరాలు 

బీసీసీఐ నివేదించిన నిషేధ జాబితాలో..

ఆటగాళ్లు, తల్లిదండ్రులు, అధికారులు టోల్ ఫ్రీ సంఖ్య లేదా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. తప్పు చేసిన వారిని గుర్తించి బీసీసీఐ నివేదించిన నిషేధ జాబితాలో చేర్చుతామని పేర్కొన్నారు. జట్టు ఎంపికలో ప్రతిభకే ప్రాధాన్యం ఇస్తామని,సరైన వ్యక్తులతో ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. లీగ్ పోటీల ప్రదర్శనతో పాటు బహిరంగ ఎంపిక పరీక్షల ద్వారా కూడా జట్లను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

వివరాలు 

అవినీతి నిరోధక విభాగానికి ఛైర్మన్‌గా విజేందర్ పింగ్లే

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)ను ఏర్పాటు చేయాలని.. జిల్లాల క్రికెటర్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని భావిస్తున్నాం'' అని రాయుడు తెలిపాడు. అవినీతి నిరోధక విభాగానికి జిల్లా మాజీ న్యాయమూర్తి విజేందర్ పింగ్లేను ఛైర్మన్‌గా నియమించారు. మహిళా ఆటగాళ్లు, సిబ్బందికి సురక్షిత వాతావరణం కల్పించేందుకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

Advertisement