ఆసియా కప్‌లో మరో కొత్త ట్విస్ట్.. పాక్ లేకుండానే టోర్నీ నిర్వహణ!
ఆసియా కప్ 2023 విషయంపై భారత్-పాకిస్థాన్ మధ్య గొడవలు సద్దుమణిగేలా కనిపించడం లేదు. అయితే ఆసియా కప్ ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని భావించిన పీసీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. భారత్‌తో జరిగే మ్యాచ్ లను తటస్థ వేదిక మీద నిర్వహిస్తామని చెప్పి ఆసియా కప్ అతిథ్య హక్కులను నిలుపుకోవాలని పాక్ ప్రయత్నించింది. అయితే ఈ నిర్ణయానికి బీసీసీఐ ఖరాఖండిగా నో అని చెప్పింది. మరోపక్క ఏసీసీలో భాగంగా ఉన్న ఇతర దేశాలు పాక్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ను అంగీకరించినట్లు తెలిసింది. దీంతో పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ జరగనున్నట్లు సమాచారం.
వరల్డ్ కప్ కు దూరం కానున్న పాకిస్థాన్?
తాజా సమాచారం ప్రకారం టోర్నమెంట్ కు అతిథ్యమిచ్చే పాకిస్థాన్ మినహా ఆసియాకప్ ఆడేందుకు ఏసీసీ సభ్యులందరూ అంగీకరించినట్లు తెలిసింది. పాకిస్తాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్ కే ఎక్కువ ప్రాధాన్యత చూపుతోంది. పాకిస్థాన్ తన నిర్ణయాన్ని సడలించకపోతే ఈసారి పాక్ జట్టు లేకుండానే ఆసియా కప్ జరగనుంది. ఏసీసీ బోర్డు సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలు శ్రీలంకలో ఆసియా కప్ ఆడేందుకు మద్దతు తెలియజేస్తున్నట్లు పీసీబీకి సందేశం పంపే అవకాశాలు ఉన్నాయి. ఈ టోర్నీలో పాక్ పాల్గొనకపోతే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్గనిస్తాన్, నేపాల్ లు శ్రీలంక వేదిక గా ఆసియా కప్ ఆడనున్నాయి. హైబ్రిడ్ మోడల్ ను భారత్ తిరస్కరిస్తే ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ తప్పుకొనే అవకాశం ఉంది.