Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై సోషల్ మీడియాలో రోహిత్ వైఫ్ సంచలన కామెంట్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కి ముందు ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మ స్థానంలో హర్థిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. రోహిత్ అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లను కూడా కోల్పోయింది. పోడ్‌కాస్ట్‌లో నాయకత్వ నిర్మాణంలో ఈ మార్పు వెనుక ఉన్న తర్కాన్ని కోచ్ మార్క్ బౌచర్ వివరించిన తర్వాత, రోహిత్ భార్య రితికా ఇంటర్నెట్‌లో తాజాగా దీని పై స్పందిస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసింది. తాజాగా రోహిత్ శర్మ భార్య రితికా చేసిన కామెంట్స్ ఇప్పుడు ముంబై జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయనే అనుమానాలకు తావిస్తోంది.
హిట్‌మ్యాన్ ఆటను ఆస్వాదిస్తూ.. స్వేచ్ఛగా రన్స్ చేయనివ్వండి: బౌచర్
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ కెప్టెన్సీ మార్పు పై ఇటీవల ఓ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ని కెప్టెన్సీ నుంచి తప్పించి 'హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చెయ్యడానికి గల కారణాలను వివరించాడు. ముంబయి ఇండియన్స్ రోహిత్ భుజాల నుండి కొంత భారాన్ని ఎత్తివేయాలని భావించిందని, అదే సమయంలో హార్దిక్‌కు కెప్టెన్‌గా ఎదిగే అవకాశం కల్పించిందన్నారు. హార్దిక్ ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌ను వరుసగా రెండు IPL ఫైనల్స్‌కు నడిపించాడన్నారు. రోహిత్ శర్మలోని ఆటగాడిని అత్యుత్తమ స్థాయిలో చూడాలనుకుంటున్నాం. హిట్‌మ్యాన్ ఆటను ఆస్వాదిస్తూ.. స్వేచ్ఛగా రన్స్ చేయనివ్వండి' అని బౌచర్ అన్నాడు.
2023లో ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైన ముంబై ఇండియన్స్
మార్క్ బౌచర్ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఈ పోడ్‌కాస్ట్‌పై రోహిత్ శర్మ సతీమణి రితికా స్పందించారు. ఇందులో చాలా విషయాలు తప్పు' అని రితక కామెంట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ అయింది. దింతో మరోసారి ముంబై యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2013 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మని కెప్టెన్‌గా నియమించింది. అదే ఏడాది ముంబైకి మొదటి ఐపీఎల్ టైటిల్ అందించాడు. అటు తరువాత రోహిత్ కెప్టెన్సీ లో ముంబై ఇండియన్స్ 2015, 2017, 2019, 2020లో టైటిల్స్ అందుకుంది. ఆ తరువాత 2021, 2022లో గ్రూప్ దశ నుంచే ఇంటిదారి పట్టిన ముంబై.. 2023లో ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.